మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంద చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద జాతీయ జెండాను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశ స్వతంత్ర చరిత్ర, దేశం కోసం ధన మానా ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ గురించి రేపటి భావి భారత పౌరులకు తెలియాలని, గాంధీజీ సినిమాను పలు సినిమా హాలులో ఉచితంగా తిలకించే ఏర్పాట్లు సీఎం కేసీఆర్ చేసినట్లు చెప్పారు.
స్వాతంత్రం సాధించి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా, 75 ఫీట్ల జాతీయ పతాకాన్ని సంద చెరువు కట్టపై ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు సంద చెరువు కట్టపై 75 ఫీట్ల భారీ జాతీయ జెండా అవిష్కరించుకోవటం భారతీయులుగా మనందరికి గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న వారోత్సవాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, స్వతంత్ర వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీపులాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, మాజీ ఎంపిపి, కార్పొరేటర్ సుద్దాల బీరప్ప లావణ్య, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.




