సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన చమురు సంస్థలు
మంచి రోజులు వొచ్చాయంటూ మంత్రి కెటిఆర్ సెటైర్లు
న్యూ దిల్లీ, జూలై 6 : సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర 50కి పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర 1055 నుంచి రూ. 1105కి చేరింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వొస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో రూ. 1053గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో రూ. 1002.50 నుంచి రూ. 1052.50, కోల్ కతాలో రూ. 1,029 నుంచి రూ.1,079కి చేరింది. చెన్నైలో రూ.1,058.50 బదులుగా రూ. 1,068.50 చెల్లించాల్సి ఉంటుంది.
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 8.50 తగ్గడం విశేషం. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 01న 19 కిలోల సిలిండర్ ధరను రూ. 183.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వొచ్చేశాయ్..అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గ్యాస్ ధరలపై మహిళా కాంగ్రెస్ ఆందోళన : గాంధీభవన్ వద్ద కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం
కేంద్రం వంట గ్యాస్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాంధీభవన్ మెట్రో స్టేషన్ వద్ద కేంద్రం దిష్టిబొమ్మను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. నరేంద్ర మోదీ డౌన్..డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారం మోగుతున్నాయంటూ విమర్శించారు. హైదరాబాద్‌కు వొచ్చి తెలంగాణ ప్రజలకు మోడీ గ్యాస్ రేట్లు గిప్ట్‌గా ఇచ్చాడంటూ విమర్శించారు. కాగా కాంగ్రెస్ నిరసనలను బీజేపీ మహిళా మోర్చా తిప్పుకొట్టింది. కాంగ్రెస్‌కు పోటీగా వారు ఆందోళన చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఏరియా దద్దరిల్లిపోయింది. మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.




