మల్లన్న సాగర్‌కు గోదావరి పరుగులు

భారీ వర్షా నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను నింపుతున్న అధికారులు
సిద్దిపేట,సెప్టెంబర్‌7 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌ను అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది. దీంతో మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు మల్లన్నసాగర్‌కు నీటిని తరలించనున్నారు. రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్‌కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు, అనంతరం కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలిస్తారు. మల్లన్నసాగర్‌లో మొత్తం 50 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.

ఈ జలాశయం ద్వారా.. ఉమ్మడి మెదక్‌, ‌నల్గొండ, నిజామాబాద్‌ ‌జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. సుమారు 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ జలాశయానికి 5 తూములు ఏర్పాటు చేశారు. వీటి నుంచి.. కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూర్‌ ‌ప్రాజెక్టుకు, తపాస్‌ ‌పల్లి జలాశయానికి.. మిషన్‌ ‌భగీరథ ద్వారా నీటిని తరలిస్తారు. అదేవిధంగా హైదరాబాద్‌ ‌తాగునీటికి 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు ఉపయోగిస్తారు. మల్లన్న సాగర్‌ ‌రిజర్వాయర్‌లో ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా.. రోజూ 0.85 టీఎంసీ నీటిని మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *