బిఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది.. కాంగ్రెస్ పని ఖతమైంది..
మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం
ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే : ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
కార్యకర్తలే బిజేపి బలం.. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే
మేడ్చల్ మల్కాజిగిరి/ఉప్పల్, ప్రజాతంత్ర, మార్చి 30: మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగరవేయ టం ఖాయమని మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈ్నల రాజేందర్ అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోనీ ఉప్పల్ నియోజకవర్గ బిజెపి నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తల సమ్మేళనం రామంతాపూర్ లోని లింగారెడ్డి గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసన సభ్యులు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిధులుగా హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గం బిజేపి కన్వీనర్ దేవసాని బాల చందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ రోజు దేశం ముందంజలో అంతర్జాతీయ స్థాయిలో శాసించే స్థానంలో ఉందంటే అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. మూడోసారి కేంద్రంలో గతం కన్నా ఎక్కువ మెజారిటీ సీట్లతో బిజేపి రికార్డు స్థాయిలో సాధించి అందులో మేడ్చల్ మల్కాజిగిరి గెలుపు ఖాయమన్నారు. బిజేపికి కార్యకర్తలే నా బలం బలగమనీ ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థ పూరితంగా పార్టీ కోసం పని చేసే నాయకులు కేవలం ఒక్క బిజేపిలోనే వుంటారని ఈటెల అన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే గొప్ప యంత్రాంగం బిజేపికీ సొంతమని కొనియాడారు. నాయకులుగా మేము తిరగలేని ప్రతి గడపకు ఒకటికి నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేస్తున్న కార్యకర్తల సేవలు వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. అంతేకాదు బిజేపిలో పని చేస్తున్నందుకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించమని గత ప్రభుత్వం, ఇప్పుటి ప్రభుత్వం అంటున్నా, వేధిస్తున్నా లెక్క చేయనీ గుండె ధైర్యం బిజేపి కార్యకర్తల సొంతమని ఈటల కొనియాడారు. తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ కారుడిగా, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన రోజులు ప్రజలు మర్చిపోలేదనీ, అందుకే ఎక్కడికి వెళ్లినా నన్ను గెలిపించుకోవడం మా కర్తవ్యం అని ప్రజలు ఇస్తున్న భరోసా కొండంత బలాన్నిస్తుందన్నారు. మల్కాజిగిరి గిరి పార్లమెంటు ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. అనంతరం ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎవరి నోట విన్నా కమలం పాటే వినిపిస్తుందనీ, ప్రతి చోట కమలమే వికసిస్తుందని చెప్పారు. మల్కాజిగిరిలో బిజేపి జెండా ఎగురుతుందన్నారు. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని చెప్పారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ కు కాలం చెల్లిందని ప్రభాకర్ అన్నారు. నమ్మినందుకు ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పని కూడా పార్లమెంటు ఎన్నికలలో ఖతమౌతుందన్నారు. మల్కాజిగిరిలో వికసించేది కమలమే అని కార్యకర్తల హర్షద్వానాల మధ్య చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరు ప్రకటించగానే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజల గుండెల్లో వున్న నాయకుడు ఈటల రాజేందర్ అని కొనియాడారు. కేసిఆర్ గుండెల్లో నిద్రపోయిన నాయకుడు ఈటల రాజేందర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, శ్రామిక, పీడిత, కార్మిక వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు ఈటెల రాజేందర్ అని చెప్పారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం నిరంతరం తపిస్తూ, పోరాటం చేసే ఈటల రాజేందర్ ను గెలిపించుకోవడం మన బాధ్యత అని ప్రభాకర్ అన్నారు. గత ఎన్నికలలో గెలిచిన రేవంత్ రెడ్డి కనీసం మల్కాజిగిరి ప్రజల ఐదు పనులు చేయలేదని, కనీసం జనం ముందుకు ఐదు రోజులు కూడా రాలేదని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కడో వుండే సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టి రేవంత్ రెడ్డి మొహం చాటేసుకున్నాడు. అది చాలు బిజేపి గెలుపును తేల్చేయడానికి అని ప్రభాకర్ చెప్పారు. బిఆర్‌ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైందని ప్రజల్లో ఎప్పుడూ వున్నది, వుండేది ఒక్క బిజేపి మాత్రమే అని ప్రభాకర్ అన్నారు. ఈటల రాజేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ప్రభాకర్ కోరారు. ఈ సమ్మేళనంలో గోలి మధుసూదన్ రెడ్డి, ఆర్ కె శ్రీనివాస్, అంపాల పద్మా రెడ్డి, రామంతపూర్, హబ్సిగూడ కార్పొరేటర్స్ శ్రీవాణి వెంకట్రావు, చేతన హరీష్, ఎం సతీష్ కుమార్, రవి నాయక్, గొరిగే కృష్ణ, మరియు సుమారు 2 వేల మంది బిజేపి నాయకులు, బూత్ కమిటీ బాధ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




