కొరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని భయపెడతున్నది. ముఖ్యంగా కొరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో బీఎఫ్-7 పేర ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్న ఈ వేరియంట్ ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను సృష్టించేదిగా ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి వ్యాప్తి చెందుతుంది. రానున్న మూడు నెల కాలంలో చైనాలో అరవై శాతం ప్రజల్లో కొరోనా విస్తరించే అవకాశం ఉంటుందని, అలాగే ప్రపంచ దేశాల్లో పది శాతం జనాభాకు సోకుతుందని ఇటీవల అమెరికన్ అంటువ్యాధి నిపుణుడు ఎరిక్ హెచ్చరించారు కూడా. అప్పుడు మరణాల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుందని చెబుతున్నాడు. ఇప్పటికే అక్కడ మరణాలను చూస్తే శ్మశానాలు కూడా ఖాళీలేవని, ఇరవై నాలుగు గంటలు శవాలు కాలుతూనే ఉన్నాయన్న వార్తలు వొస్తున్నాయి. ఈ వైరస్ చైనీయులను ఇబ్బంది పెడుతున్నంతగా ఇతర దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలను పెద్దగా ఇబ్బంది పెట్టదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చైనాలో గతంలోలాగా కొరోనా వ్యాప్తి చెందేందుకు రోజుల సమయం తీసుకోవడంలేదు. కేవలం గంటల్లోనే రెండింతలుగా పెరిగి పోవడం ఒకటైతే, చైనా వారికన్నా భారతీయుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువే ఉంటుందన్నది మరోటి. అయినప్పటికీ భారతీయులు బీఎఫ్-7 వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ప్రస్తుతం చైనాలో అత్యంత మరణాలు రికార్డు అవుతున్నాయి. అందుకు ఈ కొత్త వేరియంటే కారణం. దీన్ని చైనా కట్టడి చేయలేక పోతున్నది. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ అక్కడి వార్తలను చైనా బయటికి రానివ్వడంలేదు.
అంతటి ఉత్పాతాన్ని కలిగిస్తున్న వైరస్ ఇప్పుడు భారత్‌కు కూడా చేరుకుంది. అందుకే తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయమై అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత దేశంలో బూస్టర్ డోస్‌తో పాటు రెండు టీకాలు తీసుకున్నప్పటికీ ఈ కొత్త వేరియంట్ వల్ల ఇన్‌ఫెక్షన్‌లు వొచ్చే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ఆయన హెచ్చరించారు. ఛాతిపై భాగం, గొంతుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఊపిరి తీసుకోవడం కష్టమై వ్యక్తులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే ఇండియాలో ప్రవేశించినప్పటికీ డెల్టా, ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కున్న ఇండియా బీఎఫ్-7ను ఎదుర్కున్న సామర్థ్యం భారత్‌కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవంగా ఈ సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ మాసాల మధ్యలో ఈ వేరియంట్ ఇండియాకు వొచ్చినప్పటికీ, ఇంకా కొరోనా కేసులు రోజుకు రెండు వందలకు పైగా నమోదవుతున్న పరిస్థితిలో ప్రత్యేకంగా బీఎఫ్-7 కేసులు పెద్దగా వెలుగు చూడలేదు. దానికి తగినట్లుగా బీఎఫ్-7 కేసుల సంఖ్య కూడా పెద్దగా లేక పోవడం ఒక కారణం. ఇప్పటివరకు ఇండియాలో కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
గుజరాత్, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. అయితే ఆ నలుగురు ఆరోగ్యంగానే ఉండడంవల్ల దాన్ని సులభంగానే ఎదుర్కునగలమన్న నమ్మకం వైద్యులకు కలుగుతుంది. కాని, దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం వల్ల ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకరికి ఈ వైరస్ సోకితే అది పందొమ్మిది మందికి పాకుతుందంటున్నారు. ఇది సోకిన వారికి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నీరసం, ఒళ్ళునొప్పులు లాంటి లక్షణాలుంటాయని, మరి కొన్ని కేసుల్లో వాంతులు, డయేరియా లాంటి పొట్ట సంబంద వ్యాధులు బయట పడుతాయంటున్నారు. అందుకు మరోసారి కొరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రధానితో పాటు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొరోనా సీరియస్‌గా ఉన్నప్పుడు ఎలాగైతే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, ఏ వస్తువు ముట్టుకున్నా ఎప్పటి కప్పుడు శానిటైజర్‌ను ఉప్నయోగించుకున్నారో, భౌతిక దూరాన్ని పాటించారో ఇప్పుడు కూడా అదే విధమైన నిబంధనలను పాటించాలని ప్రధాని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇక్కడి నుండి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వారి సంప్రదాయ పండుగలు వరుసగా రానున్న దృష్ట్యా జాగ్రత్తపై దృష్టి పెట్టాలంటున్నారు. ఇప్పటికే భారత్, చైనాల మధ్య విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అలాగే ఇతర దేశాల నుండి వొస్తున్న ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా కనీసం రెండు శాతం మంది నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని కూడా కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఏకాస్త అనుమానం వొచ్చినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.




