మరోసారి తెలంగాణ దగాపడ్డది

(మండువ రవీందర్‌రావు )

తెలంగాణ మరోసారి దగాపడిరది.. అరవై ఏండ్ల ఆకాంక్షలు, పద్నాలుగా ఏండ్ల నిర్విరామ పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా పోయాయి.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు మిగిలింది అప్పులు, అవినీతి, విధ్వంసం మాత్రమే.. వేలాది మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అన్యాక్రాంత మవుతున్నది.. నిధులు, నియామకాల నినాదం అటుకెక్కింది.. ఒకే కుటుంబ ఆధీనంలో పక్షపాత, రాజరిక పాలన కొనసాగుతున్నది.. సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిరది.. ఈ పరిస్థితిలో ఇక్కడ మరోసారి ఎన్నికలు జరుగబోతున్నాయి.. ప్రత్యేక రాష్ట్రంలో మూడవసారి జరుగుతున్న ఎన్నికలివి.. ఈ ఎన్నికల్లోనైనా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనుకుంటున్నాం.. కాసులకు, తాయిలాలకు ప్రలోభపడకుండా నిర్భయంగా, నిర్భీతితో వోటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకటనారాయణతో ప్రజాతంత్ర ప్రత్యేక ఇంటర్యూ… తొలి, మలి విడుత తెలంగాణ ఉద్య మానికి ప్రత్యక్షసాక్షి వెంకటనారాయణ దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ శిష్యుడు. కాళోజీ ధిక్కార స్వరాన్ని పుణికిపుచ్చున్నవాడు. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్భవించిన అనేక పార్టీలు, సంస్థలతో ఆనుబంధం ఉన్న ఆయన ఒక సామాజిక కార్యకర్త, ఆర్థిక నిపుణులు కూడా..!

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై మీ అభిప్రాయం?
-ఇవ్వాళ సామాన్యుడు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితిలేదు. కోట్లాది రూపాయలు ఉన్నవాడే అందుకు అర్హుడవుతున్నాడు. అలాంటివారకే రాజకీయ పార్టీలు టికెట్‌ ఇస్తాయి. నిరాడంబరంగా ఉండి, ప్రజలకు సేవ చేయాలనుకున్నవాడికి రాజకీయాల్లో చోటులేదు. మందిని కొట్టు, ఎన్నికల్లో పెట్టు, మళ్ళీ సంపాదించుకో అన్నట్లుంది నేటి ఎన్నికల తీరు. తమిళనాడులో మొదలైన ఈ కల్చర్‌ క్రమేణ దేశమంతా పాకింది. కెసిఆర్‌ దేశ రాజకీయాల్లోకి వొచ్చినా జరిగేది ఇదే. పార్టీని బతికించుకోవడం, కార్యకర్తలను పోషించడం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, చివరకు వోట్లు వేయించు కోవడానికి కూడా డబ్బే ప్రధానం. ఎన్నికల్లో నెగ్గినవారు పేరుకే ప్రజాప్రతి నిధులు కాని, వారు చేసేవన్నీ సెటిల్‌మెంట్స్‌, పథకాల్లో, ప్రాజెక్టుల్లో పర్సంటేజీలు తీసుకోవడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించుకోవడమే వారి ప్రధాన లక్ష్యం.

తెలంగాణ అభివృద్ధిచెందిందా?
తెలంగాణలో జరుగుతున్నదంతా అభివృద్ధిపేరున విధ్వంసం.. వనరుల పంపిణీ అన్నది మానవ వనరుల్లో భాగమై ఉండాలి. వ్యాపారం, వృత్తులు, వ్యవసాయం డబ్బున్నవారి చేతిలోకి వెళ్తున్నది. బట్టల షాపులు, జ్యువలర్స్‌, ఆటోమోబైల్‌ చివరకు కిరాణా అమ్మకాలుకూడా కోర్పోరేట్‌ చేతుల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా వొస్తున్న మాల్స్‌, మల్టీ స్పెషాలిటి హాస్పిటల్స్‌, యూనివర్శిటీలు, కాలేజీలు నాయకుల పెట్టుబడులతో నడుస్తున్నాయి. సహజ వనరులైన ఇసుక, గ్రానెట్‌ నాయకుల నియంత్రణలోనే ఉంటున్నాయి. అధికా రులకు అధికారాలే లేకుండా పోయాయి. ఎమ్మెల్యే చెబితేనే అధికారులు పనిచేస్తారు, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ రాస్తారు. కిందిస్థాయి నాయకులు మొదలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వరకు నాయకుల అడుగులకు మడుగులొత్తు తూ వారు ఎంత చెబితే అంతే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నాయకులతో చేతులు కలుపుతూ, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాము లవుతున్నారు. లంచం ఇస్తేనే ఉద్యోగం, ఉద్యోగం వొచ్చిన తర్వాత తిరిగి తన లంచం డబ్బులకు పదిరెట్లు రాబట్టుకోవడానికి ప్రజలను పిండడమన్నది సహజ మైపోయింది. అభివృద్ధి సంక్షేమం అన్నది బండి చక్రాల్లా రెండూ సమాంతరంగా సాగాలి. ఆర్థిక వ్యవస్థను బాగుచేయాలంటే సామాజిక, ఆర్థిక, సహజ వనరులను పరిగణలోకి తీసుకోని ప్రణాళికలను రచించుకోవాల్సి ఉంటుంది. సమాజ స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. విద్య, వైద్యం, ఇరిగేషన్‌, పరిశ్రమలు అభివృద్ధి కిందికి వొస్తాయి. రోడ్లు, కరెంటు కూడా అందులో భాగమే. పైన చెప్పినవన్నీ తెలంగాణలో లోపభూయిష్టంగానే ఉన్నాయి. పాలకులు చెబుతున్న అభివృద్ధి అంతా హైదరాబాద్‌ చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి మాత్రమే. ఫార్మా సిటీలు, ఐటి హబ్‌లు ఇతర జిల్లాలకు విస్తరించడంలేదు. హైదరాబాద్‌ తర్వాత రెండవ శ్రేణి నగరాలైన వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌,లాంటి ఉమ్మడి జిల్లాలు ఈ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాయి. మెడికల్‌, ఐటి రంగాలకు లభించినంత ప్రోత్సాహం ఇతర రంగాలకు లభించకపోవడంకూడా ఒక కారణంగా మారుతున్నది

తెలంగాణ మాడల్‌ అంటే ?
రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్యం ద్వారా ఎనిమిదివేల కోట్లు వొస్తుండే. 2023`24లో ఆ ఆదాయం 45 వేల కోట్లకు పెరిగింది. అంటే ప్రత్యేక రాష్ట్రంలో మొదటి బడ్జెట్‌ లెక్కలను పరిశీలించినప్పుడు తొమ్మిది శాతంగా ఉన్న ఆదాయం అయిదు వందల శాతం పెరిగిందన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఏమేరకు తాగబోతులను చేస్తున్నదన్నది అర్థమవు తున్నది. అప్పులు, రెవెన్యూ, కేంద్రంనుండి వొచ్చేనిధులు కలుపుకుని రాష్ట్ర ఆదాయం 2 లక్షల 25వేల కోట్ల రూపాయలుంటే అందులో 45 వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలమీద వొస్తున్నదే. ప్రారంభంలో 800 ఉన్న మద్యం షాపుల సంఖ్య ఇప్పుడు 2700కు పెరిగాయి. బార్‌ షాపులు సుమారు 60 వేల వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా అనధికారిక బార్‌షాపులకు లెక్కేలేదు. ఇదే మన తెలంగాణ మాడల్‌ అని మనం అనుకోవాలె.

రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలపై మీ అభిప్రాయం ?
-ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడలేని హామీలను గుమ్మరి స్తాయి. ముఖ్యంగా ఉచితాల జాబితా ముందుపెట్టి వోట్లను దండుకునే ప్రణాళికలను రచిస్తుంటాయి. ఈ విషయం లో ఈపార్టీ, ఆపార్టీ అనికాదు, అలానే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనికూడాకాదు, చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుకూడా వీటిమీదే దృష్టి పెడుతున్నాయి. అయితే జాతీయ పార్టీల లక్ష్యాలు కొంత వేరుగా ఉంటాయి. అవి ఏ పథకాలను ప్రవేశ పెట్టినా జాతీయ దృక్పథంతో ఆలోచిస్తుం టాయి. కాని, ఇటీవల కాలంలో జాతీయ పార్టీలుకూడా రాష్ట్ర పార్టీల మాదిరిగానే ఆలోచిస్తున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వొస్తే ఆ రాష్ట్రానికి తగ్గట్లుగా హామీల వర్షాలు గుమ్మరిస్తున్నాయి. ఉదాహరణకు మరో పదిపన్నెండు రోజుల్లో జరుగనున్న తెలంగాణ ఎన్నికల విషయాన్నే తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బిసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. స్వయంగా ప్రధాని అంతటివాడు చేసిన ఈ ప్రకటన యావత్‌ దేశానికి వర్తిస్తుందా అంటే కాదనే చెప్పాలె. జాతీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు అయ్యేవిధంగా ఉన్నప్పుడే ఆ పార్టీలపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది.

ఇక ప్రాంతీయ పార్టీల విషయాని కొచ్చినప్పుడు ఇవి ఎక్కువగా ఆధిపత్య ధోరణితో కొనసాగుతుంటాయి. ఇక్కడ వారసత్వ రాజకీయాలు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. కుటుంబ పాలనను దృష్టిలో పెట్టుకుని, వోట్లను రాబట్టుకునేందుకు అడగని సంక్షేమ పథకాలను సృష్టించి ప్రజలపై రుద్దటానికి ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలు పోటీపడి ఒకరిని మించి ఒకరు ఉచితాలను ప్రకటించడమన్నది సర్వసాధరణ మైపోయింది. ఈ క్రమంలో అవి హద్దులు అతిక్రమిస్తున్నాయికూడా. మన రాష్ట్ర విషయానికొస్తే అప్పులు చేయడంలో రాష్ట్రం తన పరిధులను ఎప్పుడో దాటిపోయింది. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధలను అతిక్రమించింది. చేసిన హామీలు నెరవేర్చడంకోసం అదనపు ఆదాయంకోసం వివిధ దారులు ఎతుక్కోవాల్సి వొస్తున్నది. ప్రజలు ఇప్పటికే అధిక పన్నుల భారాన్ని మోస్తున్నారు. ఆదాయం కోసం ప్రభుత్వానికి మరింత పన్ను విధింపుకన్నా మరో మార్గం లేదు. కాని పక్షంలో ఆస్తులు అమ్ముకోవడమే. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనికూడా అదే. ఎంతో విలువైన భూములను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా ప్రైవేటు కంపెనీలకు దారదత్తం చేస్తున్నాయి. పోనీ అమ్మడంద్వారా వొచ్చిన కోట్లాది రూపాయలను మళ్ళీ ఉత్పత్తి రంగాల్లోకి మళ్ళిస్తున్నాయా అంటే అదీలేదు. తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఈ నిధులను సంక్షేమం పేరున హారతి కర్పూరంలా హరింపజేస్తున్నాయి. ఇదిలాఉంటే తమ అంగబలాన్ని పెంచుకు నేందుకు రాజకీయ పార్టీలు ప్రజలపై మరింత భారాన్ని మోపే విధంగా తమ అనుమాయులకు రాజకీయ పునరావాసాన్ని కలిగిస్తున్నారు. సలహాదారులనో, చైర్మన్‌ లు అనో మరోదో పేరుతో నామినేటెడ్‌ పోస్టులను సృష్టించి వారి టిఏ, డిఏ, బంగ్లాలు, కార్లు, విద్యుత్‌ ఛార్జీలు, ఆఫీస్‌ సిబ్బంది అంతా కలిపి కోట్లాది రూపాయలను వృధా చేస్తున్నారు. ఈ వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంక్షేమంపై మీ అభిప్రాయం ..?
-సంక్షేమం విషయానికొస్తే వాస్తవ లబ్ధిదారుడికి ఫలాలు అందే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. అవసరం ఉన్నా లేకున్నా అందరికీ కలిపి సామూహిక సంతర్పణలు చేయడంద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వ అందిస్తున్న రైతు బంధు పథకం ఒక విధంగా మంచి పథకమే అయినప్పటికీ దాని అమలు లోపభూయిష్టమనే చెప్పాలె. ఎకరం మొదలు వంద ఎకరాల భూస్వామికి కూడా ఒకే విధంగా సంతర్పణ చేయడంవల్ల ప్రభుత్వ ఖజానా ఖాలీ అవుతున్నది. యాభై, వంద ఎకరాల భూస్వామికి ఆర్థిక సహాయం అవసరమా? మరో విషయం రికార్డు ప్రకారం పట్టేదారు ఖాతాలో డబ్బు పడుతున్న మాట నిజమే అయినా, అది పంటపండే భూమినా, లేక పడావ ఉన్నదా, అసలు ఆ భూయజమాని దేశంలో ఉన్నాడా? విదేశాల్లో నివసిస్తున్నాడా? అవేవీ పరిగణలోకి తీసుకోకపోవడం ప్రజల డబ్బును వృధా చేయడమే అవుతుంది.

దానికన్నా రైతుకు కావాల్సిన ఎరువులు, పురుగమందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు లాంటివాటిని ఉచితంగా, సబ్సీడి రూపంలో అందిస్తే రైతుకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. దానికి తగినట్లుగా గిట్టుబాటు ధర కల్పించడం, ఇంకా రైతుకు సహాయం చేయాలనుకుంటే గిట్టుబాటు ధరపైన అదనపు ధర కల్పించి రైతుకు మేలు చేయవచ్చు. కళ్ళాల వద్దే కొనుగోలు చేయిస్తున్నామని చెబుతున్నది ప్రభుత్వం. కాని కళ్ళాల వద్ద తూకంలో ఎంత ధాన్యాన్ని దండి కొడుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ధాన్యం కొనుగోళ్ళు మొదలైనప్పటినుండి నిత్యం మీడియాలో వొస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నది. అలాగే ఉచిత బియ్యం విషయంలోకూడా. రాష్ట్రంలో సుమారు కోటి తెల్లకార్డులున్నాయి. ఒక కుటుంబంలో తక్కువలో తక్కువ కనీసం ముగ్గురు ఉంటారని లెక్క వేసుకున్నా మూడు కోట్లమంది అవుతారు. ఈ మూడు కోట్లమంది నిజంగానే పేదవారా? అందరికీ ఉచిత బియ్యం అవరమా అన్న విచక్షణ కరువైంది. అవసరం ఉన్నా లేకున్నా, ఉచితంగా వొస్తున్నాయని బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు.. గొర్రెలు, బర్రెలు ఇలా ఏది చూపినా సరైన విధానం లేక ప్రజా సొమ్ము ధ్వంసమవుతున్నది.

తెలంగాణ విత్తన హబ్‌గా మారిందా ?
-తెలంగాణ ను విత్తన హబ్‌గా మారుస్తామని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత పదేళ్ళుగా చెబుతూనే ఉంది. విత్తన హబ్‌ సంగతి పక్కన పెడితే కనీసం పండిన పంటను సకాలంలో కొనుగోలుచేసే పరిస్థితిలో కూడా లేక పోవడం విచారకరం. పంటల మార్పిడిని ప్రకటించింది. అందుకు కావాల్సిన కనీస ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తయారు చేయలేకపోయింది. భూముల సారవంతాన్ని బట్టి ఏ భూమిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని వ్యవసాయ అధికారులే చెబుతారంది. ఒక్కో జిల్లాలకు ఒక్కో రకం పంట పండిరచడం ద్వారా పండిరచిన పంటకు గిట్టుబాటు ధర వొస్తుందని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు కావాల్సిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తామంది. దానిపై మళ్ళీ పట్టించుకోనేలేదు. ఒక రకం దొడ్డు బియ్యం కొనమని చెప్పింది. రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు సన్నబియ్యం పండిరచాలంటోంది. ప్రభుత్వానికి ఒక విధానం లేకుండా పోతున్నది.

(సశేషం)

lead
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వ అందిస్తున్న రైతు బంధు పథకం ఒక విధంగా మంచి పథకమే అయినప్పటికీ దాని అమలు లోపభూయిష్టమనే చెప్పాలె. ఎకరం మొదలు వంద ఎకరాల భూస్వామికి కూడా ఒకే విధంగా సంతర్పణ చేయడంవల్ల ప్రభుత్వ ఖజానా ఖాలీ అవుతున్నది. యాభై, వంద ఎకరాల భూస్వామికి ఆర్థిక సహాయం అవసరమా? మరో విషయం రికార్డు ప్రకారం పట్టేదారు ఖాతాలో డబ్బు పడుతున్న మాట నిజమే అయినా, అది పంటపండే భూమినా, లేక పడావ ఉన్నదా, అసలు ఆ భూయజమాని దేశంలో ఉన్నాడా? విదేశాల్లో నివసిస్తున్నాడా? అవేవీ పరిగణలోకి తీసుకోకపోవడం ప్రజల డబ్బును వృధా చేయడమే అవుతుంది. దానికన్నా రైతుకు కావాల్సిన ఎరువులు, పురుగమందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు లాంటివాటిని ఉచితంగా, సబ్సీడి రూపంలో అందిస్తే రైతుకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *