బ్రతుకు ఇంధనాలుగా
మనం సృష్టించుకున్న
ఆర్థిక బంధనాల్లో చిక్కుకొని
మన అనుబంధాలు
విచ్ఛిన్నమైపోతున్నాయి…
స్వచ్ఛమైనజి
ఆత్మీయ ఆలింగనాలు
అదృశ్యమైపోతున్నాయి…
కన్నీరు తుడిచి పన్నీరు చిలికించే
పరస్పర పలకరింపులు
కలలుగా మిగిలిపోతున్నాయి…
మనిషి మనోకాలుష్యం
కాఠిన్యపు కరిమబ్బులై
‘జీవితం వెన్నెల’ను కప్పేస్తుంటే
అలజడుల తిమిరాలు
అంతటా అలుముకుంటున్నాయి…
అతనిని ఆవహిస్తున్న
ఆధిపత్యపు కాంక్ష
యుద్ధోన్మాదమైజి
అవనిని ఆవహిస్తోంది…
మిత్రులారా!
ఇప్పుడు మనం
మన హృదయ ప్రమిదల్లో
మమతల దీపాల్ని వెలిగించి
ఆ చీకట్లను తొలగించాలి…
దుఃఖపు శిశిరాలతో
వాడిపోతున్న జీవనోద్యానాల్ని
మన మనోవసంతాలతో
విరబూయించాలి…
మానవతా సుగంధాలతో
జనవాహిని పులకించాలి…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
9177732414, తిరుపతి (ఆ.ప్ర).




