భోపాల్, జులై24 ః మధ్యప్రదేశ్ లో వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇక్కడి రేవా జిల్లాలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చేతులు విరిచికట్టి,, అర్ధనగ్నంగా నిలబెట్టి.. అతడిపై పదేపదే దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అంతటితో ఆగకుండా.. అతడి నోటితో బూటును ఎత్తించారు. రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆస్తి తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నట్లు చెప్పారు.పోలీసుల వివరాల ప్రకారం.. రేవాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి, సర్పంచి భర్త జవహర్ సింగ్‌కు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే జవహార్.. అతడిని కిడ్నాప్ చేశాడు. చేతులు వెనక్కి కట్టేసి, అర్ధనగ్నంగా నిలబెట్టి ముఖంపై గుద్దులు గుద్దాడు. వదిలేయాలంటూ వేడుకున్నప్పటికీ.. కనికరించకుండా, నోటితో బూటు ఎత్తించాడు. 2021లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. దీంతో ప్రధాన నిందితుడు జవహర్ సింగ్‌తోపాటు అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడని, గ్రామ సర్పంచికి భర్త అని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు ముగ్గురు నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.



