– వాహనాల లైఫ్ టాక్స్ పెంపుపై హరీష్రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నడని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్రావు విమర్శించారు. జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను ముఖ్యమంత్రి దొంగ దెబ్బ కొట్టిండన్నారు. లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ ను 12శాతం నుంచి 15శాతానికి పెంచడం దుర్మార్గమన్నారు. బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటి వరకు రూ.13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.16,500 లకు పెరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ వేస్తున్నదన్నారు. కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పు చేసో, లోన్ తీసుకొనో మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్ళు చల్లిందన్నారు. 10లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేసి ప్రజల కోరికలను కూడా ముఖ్యమంత్రి సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపించారు. 10-20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచిండు. అంటే దాదాపు 20 వేల అధిక భారం కొనుగోలు దారులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నదన్నారు. 20లక్షలు దాటితే రెండు శాతం, 50లక్షలు దాటితే మూడు శాతం. ఇట్ల అడ్డోగులుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నడన్నారు. కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచిండు. 20లక్షల పైగా ఉంటే 20శాతంగా ఉన్న పన్నును 22శాతానికి, 50లక్షలు దాటితే 25శాతం పన్ను కట్టాలని నిర్ణయించడం దారుణమన్నారు. కమర్షియల్ వెహికిల్స్ పై పన్ను పెంచడం వల్ల, చివరకు అది మార్కెట్ పై, ప్రజలపైనే ఆ భారం కూడా పడుతుందన్నారు. హ్యామ్ మోడల్ పేరిట రోడ్లను ప్రైవేటు కంపెనీలకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పజెప్పే నిర్ణయించారన్నారు. హేమ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్ పెంచడం శోచనీయమన్నారు. కంపెనీలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు యాన్యుటీలు చెల్లించడం కోసం టోల్ ద్వారా వసూలు చేయబోమని చెబుతూ మరోవైపు దొంగదారిలో ఈ పన్నుల పెంపు చేయడం సిగ్గుచేటన్నారు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తున్నదన్నారు.
మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం





