మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం
పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌

ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌విమర్శించారు. మణిపూర్‌లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే అక్కడ హింస చెలరేగుతుందని ఆరోపించారు. ఇటీవల మాణిపూర్‌లో జరిగిన హింసాత్మాక ఘటనల నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో ‘మణిపూర్‌ ‌హారర్స్’ అనే అంశంపై మీడియా ఎడ్యుకేషన్‌ ‌ఫౌండేషన్‌, ఇం‌డియా(మెఫి) ఆధ్వర్యంలో ‘మెఫి టేక్స్’ ‌కార్యక్రమం మెఫీ ట్రస్టీ, సీనియర్‌ ‌జర్నలిస్టు, ఆలపాటి సురేష్‌ ‌కుమార్‌ అధ్యక్షతన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం   జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ…మణిపూర్‌లో విభజించి పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న ప్రభుత్వాలు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్లే హింస మరింత ప్రజ్వరిల్లుతుందని ఆయన అన్నారు.

అధికార వర్గాలకు సన్నిహితంగా ఉన్న మెయితీలకు దొడ్డి దారిన ప్రభుత్వ ఆయుధాలు అందుతున్నా స్థానిక పోలీసులు, పారా మిలిటరీ బలగాలు మౌనముద్ర పాటిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మూడు వేల నుంచి నాలుగు వేల దాకా తుపాకులను, రెండు నుంచి మూడు లక్షల దాకా బుల్లెట్లను మెయితీలు లూటీ చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన భద్రతా దళాలు ఆయుధాలు అప్పగించండని ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటిదాకా మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌లోనూ, దాని పరిసర ప్రాంతాల్లోనూ నివసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులతో ధనికులుగా మారిన మెయితీలు ఇప్పుడు కొండ ప్రాంతాలలోని అటవీ సంపదపై కన్నేశారని హరగోపాల్‌ ‌చెప్పారు.

మెయితీ వర్గాన్ని కూడా షెడ్యూల్డు తెగగా గుర్తించి వారిని ఆ జాబితాలో చేర్చడానికి చర్యలు చేపట్టవలసిందిగా మణిపూర్‌ ‌హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో నిరుపేద ఆదివాసీలైన కుకీ వర్గం వారు ఆందోళనలు ప్రారంభించారని, వారి మీద మెయితీలు దాడులకు తెగబడటంతో హింసకాండ చెలరేగిందని వివరించారు. దాడులను ఆపి శాంతిని నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వాస్తవానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మణిపూర్‌లో పర్యటించి వొచ్చిన తర్వాతనే అక్కడ ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు.

భారత దేశానికి సమాఖ్య వ్యవస్థ పనికిరాదని, విస్తృత అధికారాలతో కూడిన అధ్యక్ష తరహా పాలన మేలని అన్నారు. దేశాన్ని ఎప్పటికైనా హిందూ రాజ్యంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించడానికి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో జరిగిన నరమేధం కానీ, ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలు కానీ ఆ పథకంలో భాగమేనని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషాలను ఆపాలన్న చిత్తశుద్ధిని ప్రభుత్వం కనబరచడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీ కుకీ మహిళలను మెయితీ వర్గానికి చెందిన వందలాది మంది నగ్నంగా ఊరేగించి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సుప్రీమ్‌ ‌కోర్టు స్పందించే వరకూ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిస్టియన్‌ ‌లైన కుకీలకు చెందిన 300 చర్చిలను మెయితీలు కూల్చివేయడం దారుణమన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ను మెఫీ మేనేజింగ్‌ ‌ట్రస్టీ, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) కార్యదర్శి వై.నరేందర్‌ ‌రెడ్డి, ప్రెస్‌ ‌క్లబ్‌ ‌కోశాధికారి ఏ.రాజేష్‌, ‌పలువురు సీనియర్‌ ‌జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *