మణిపూర్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

  • ఘటనకు బిజెపియే కారణం…అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
  • మారణహోమం వెనక బిజెపి హస్తం
  • ములుగులో జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క ధర్నా

ములుగు, ప్రజాతంత్ర, జూలై 21 : మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా సీతక్క డిమాండ్‌ ‌చేశారు. ములుగు-హైదరాబాద్‌ ‌జాతీయ రహదారిపై నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… మహిళలపై అమానవీయ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ప్రతి మారణ హోమం వెనుక మోదీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. 50,000 మంది పోలీసులు ఉన్నా కూడా మణిపూర్‌ ‌రాష్ట్రంలో మహిళలకు, మానవ హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

మహిళలను అత్యంత కిరాతకంగా హింసించిన దోషులను కాపాడం కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అదానీ, అంబానీ ఆస్తులను కాపాడుకోవడం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఇది అని అన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోదీ పెదవి విప్పక పోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ప్రభుత్వం వెంటనే మణిపూర్లో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ ‌చేశారు. మణిపూర్‌ ‌లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ ‌సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆడ పిల్లలను బహిరంగంగా నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన మానవత్వానికి మచ్చను తెచ్చే విధంగా ఉంది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక తాలిబన్ల దేశంలో ఉన్నామా? ఘటన జరిగిన 79 రోజుల తరువాత అది బయటకి రావడం, ఇలాంటి ఘటనలు వందల కొద్ది జరిగాయని స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి ఒప్పుకోవడం, అక్కడ ఇంటర్నెట్‌ ‌రద్దు చేసి సమాచారం బయటకి రాకుండా అడ్డుకోవడం.. ఇదంతా మోడీ ప్రభుత్వం కావాలనే చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది’ అని సీతక్క మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *