ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి) ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి నుండి తల పెట్టిన బంద్ ను తాత్కాలికంగా బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జెఎసి కన్వీనర్ ఎస్.దయనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్ట్ 5 న అసెంబ్లీ ముట్టడి, 8 న రవాణా కార్యాలయం ముట్టడి లాంటి ధర్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం సమస్యల మీద చర్చలకు పిలవక పోవడంతో 10వ తేదీ అర్ధరాత్రి నుండి ఆటో, క్యాబ్, లారీ రవాణా రంగం బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు దఫాలుగా విన్నవించుకున్నా ఫలితం లేదని అన్నారు. జేఏసీ బంద్ కు పిలుపునిచ్చిన నేపధ్యంలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుందని జెఎసి నాయకులను రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ తన్నీరు హరీష్ రావు పిలిపించి సమస్యల మీద సిఎం కెసిఆర్ తో చర్చించి 15 రోజులల్లో పరిష్కారం అయ్యేలా చూస్తానని, ప్రస్తుతానికి బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని మంత్రి కోరడంతో విరమించినట్లు తెలిపారు. ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే తిరిగి బంద్ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు, టి.రాజశేఖర్ రెడ్డి, రుద్రాక్ష మల్లేష్, బిజ్జులా రామకృష్ణా రెడ్డి, పింగళి సంపత్ రెడ్డి, రాంపల్లి మల్లేష్ గౌడ్, శివ కుమార్, ఎన్.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.




