- పెద్దమ్మ తల్లి లాంటిదే
- పూనె వైరాలజీ ల్యాబ్‌కు కామారెడ్డి వ్యక్తి నమూనాలు
- నేడు రిప్టోర్టస్ వొస్తాయన్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో మంకీపాక్స్ కలకలం రేపుతుంది. కామారెడ్డిలో ఓ 40 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. బాధితుడికి మెడ, గొంతు, చేతి, ఛాతీ వి•ద పొక్కులు వొచ్చాయన్నారు. వెంటనే ఐదు రకాల శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కి తరలించి బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పేషెంట్ రిపోర్టస్ వొస్తాయన్నారు. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తితో నేరుగా ఆరుగురు కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ అయినట్టు గుర్తించామన్నారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్‌కు సింప్టమ్స్ లేవని తేల్చిచెప్పారు. ముందు జాగ్రత్తగా వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని..ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.
ఈ వైరస్ గాల్లో వ్యాప్తి చెందదని..విదేశాల నుంచి వొచ్చిన వాళ్లకు జ్వరం వొస్తే ఐసోలేషన్ ఉంచాలని సూచించారు. మంకీ పాక్స్ సోకిన వ్యక్తికి 6 నుంచి 13 రోజుల తర్వాతనే లక్షణాలు బయటపడతాయన్నారు. మంకీపాక్స్‌కు ప్రత్యేక ట్రీట్‌మెంట్ లేదన్నారు. పోచమ్మ తల్లిలాగే ఈ వ్యాధి దానంతట అదే పోతుందన్నారు. మంకీపాక్స్ గాలి ద్వారా సోకదని..ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన పని లేదని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. బాధితుడి నుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని ఎన్‌ఐవీకి పంపామని..మంగళవారం యంత్రానికి రిపోర్టస్ వొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చేతులు, కాళ్లు, ఛాతీపై దద్దుర్లు ఉన్నాయని.. నీరసం, కాస్త జ్వరం ఉందని తెలిపారు. అతని శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్‌లాగే ఉన్నాయన్న ఆయన..వైరస్ నిర్దారణ కోసం రోగి నుంచి 5 రకాల శాంపిల్స్ సేకరించినట్లు వివరించారు. వాటిని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు.
రేపు సాయంత్రానికి బాధితుడి వైద్య పరీక్షల ఫలితాలు వొచ్చే అవకాశం ఉందన్నారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి, రోగి పెద్దగా దగ్గినప్పుడు వొచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకే అవకాశం లేదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వొచ్చిన వారి శరీరంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలున్నట్లు బయటపడింది. ఈ నెల 6న అతడు కువైట్ నుంచి కామారెడ్డి వొచ్చారు. 20న జ్వరం వొచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కి తరలించారు. రోగితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించి వారినీ ఐసోలేషన్ చేశారు.




