ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని పాలకులు
తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ దుర్ఘటన
ఏళ్లు గడుస్తున్నా నేటికీ నరకయాతనే
భోపాల్,డిసెంబర్2 : భోపాల్ విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న మెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు. భోపాల్ ప్లాంట్‌లో భద్రతాచర్యలు లేవనే సమస్యను ఆ ప్లాంట్‌లోని కార్మిక సంఘాలు పదేపదే లేవనెత్తాయి. వాటిని యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ చివరకు బాధపడిందెవరు? కార్మికులు, భోపాల్‌లోని పేదలు మాత్రమే. ప్లాంట్ చుట్టూ ఉన్న కార్మికుల కాలనీలు, పేదల బస్తీలు, మురికివాడల్లో నివసించేవారే ఎక్కువగా నష్టపోయారు. నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం సర్యలు చర్యలు తీసుకోలేక పోయింది. బాధ్యులకు శిక్షపడిన తీరు కూడా అనుమానమే. భోపాల్ ప్రజలకు తగిన విధంగా నష్టపరిహారం ఇచ్చారా అంటే అదీ అరకొరే. వారి వైద్య ఖర్చులు చెల్లించడం లాంటివి కూడా అంతంతమాత్రమే. ఇలాంటివి జరగకుండా అడ్డుకునేందుకు, జవాబుదారీతనం కల్పించేందుకు భారత ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదు. దోపిడీ చేసేవారికి, బహుళజాతి కంపెనీల అత్యాశకు, ప్రభుత్వంలోని వారి మద్దతుదార్లకు వ్యతిరేకంగా దోపిడీకి గురౌతున్న పేదలు జరిపిన పోరాటమే. ఈ మొత్తం విషాదగాథ కొన్ని కఠోర సత్యాలను మన ముందుంచాయి. నాటి కాంగ్రెస్ నుంచి నేటి ఎన్‌డిఎ ప్రభుత్వాలు అమెరికా, భారత బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయనేది అక్షరసత్యం.
భోపాల్ దుర్ఘటనలో మరణించిన 22 వేల మంది, గాయపడిన లక్షలాది మంది ప్రజలు పేదవారే. ప్రపంచంలో ఎక్కడా ఎవరూ ఉపయోగించ వీలులేని అధ్వాన్నమైన టెక్నాలజీని భోపాల్‌లో వాడినట్లు గ్యాస్ దుర్ఘటన సంభవించేవరకూ తెలియదు. ఇప్పటికీ భోపాల్ యు.సి.సి. ప్లాంట్‌లో వేలాది టన్నుల విషపూరిత పదార్థాలున్నాయి. కార్పొరేట్, ఎం.ఎన్.సి శక్తివంత కంపెనీలు తమ చేష్టల వల్ల ప్రస్తుత తరంపైనా, రేపటితరాలపైనా చూపే ప్రభావాల గురించి పట్టించుకోవని రుజువు అయ్యింది. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించే ఏకసూత్ర కార్యక్రమం వారిది. కాబట్టి మన దేశంలో పరిహారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తేవాలి. భోపాల్ దుర్ఘటనను ఎన్నడూ మరచిపోరాదు. దీనికి కారకులైనవారిని బోనులో నిలబెట్టాలి. భోపాల్ ప్లాంట్‌లోని వ్యర్థ పదార్థాలను తొలగించే బాధ్యత చేపట్టాలి. నష్ట పరిహారం పెంచాలి. బాధితుల కోసం సక్రమమైన వైద్య వ్యవస్థను ఏర్పాటుచేసి వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. భోపాల్ దుర్ఘటన నుండి గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్ తరాలు పాలక వర్గాలను క్షమించవు. అలాగే ప్రజలు కూడా చైతన్యం కాకపోతే ఇలాంటి దురవస్థలు కూడా తప్పవని గుర్తించాలి.




