- దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత మనదే
- సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలి
- కమిట్మెంట్ ఉన్న నాయకుడు పెద్ది…గత ఎమ్మెల్యేలు చేయని పనులు చేసి చూపించిండు
- ప్రభుత్వం ఏదైనా ఎమ్మెల్యే సరిగ్గా ఉండాలి
- నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భూ మండలం మొతం మీద రైతుబంధు తెచ్చిందే తానని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నర్సంపేట పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ… సభకు వొచ్చిన జన సంద్రాన్ని చూస్తుంటే బీఆర్‌ఎస్ నర్సంపేట అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడన్నారు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని, గత ఎమ్మెల్యేలు చేయని పనులు పెద్ది చేసి చూపించిండు అని కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ పుట్టిందే ప్రజల సంక్షేమం కోసం అన్నారు. నియోజకవర్గ అభ్యర్థిని ఎన్నుకునే ముందు అభ్యర్ధి కమిట్మెంట్ చూడాలని చెప్పారు. ఇంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచి నర్సంపేటకు ఏం వరగపెట్టారని కేసీఆర్ ప్రశ్నించారు. 60 ఎండ్ల కాలం నాటి కల…పాకాల గోదావరి నీళ్లను సుదర్శన్ రెడ్డే పట్టుపట్టి సాధించాడని తెలిపారు. జిల్లా స్థాయి ప్రభుత్వ హాస్పిటల్‌ను, మెడికల్ కళాశాలను ఇలా ఎన్నో నియోజకవర్గానికి తీసుకొచ్చింది సుదర్శన్ రెడ్డినే అంటూ ప్రశంసించారు.
మనల్ని కరువుకు గురి చేసింది, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే కదా అని దుయ్యబట్టారు. గతంలో కరెంటు ఎట్ల ఉండే..ఈనాడెట్ల ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ వోటును ఆశా మాషాగా వెయ్యొద్దని, ప్రభుత్వం ఏదైనా ఎమ్మెల్యే కరెక్టుగా ఉండాలని, అన్నీ చేసుకుని ఆలోచించి వోటేయాలని కెసిఆర్ సూచించారు. పీఎం మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదని, మన తెలంగాణలోనే 24 గంటల కరెంటు ఉందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గానికి రైతుబంధు ఉండాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలన్నారు. ప్రత్యేకంగా రైతుల కోసమే ధరణిని తెచ్చానని తెలిపారు. రైతులకు 3 గంటలే కరెంట్ అవసరం అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, మరి పంటలకు నీరు పారాలంటే కేవలం 3 గంటలు కరెంట్ సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు 10 హెచ్‌పి మోటార్లు ఎవడన్న పెడ్తడా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనుద్దేశించి ఎద్దేవ చేశారు.
కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న తెలంగాణకు, రాష్ట్రం సిద్ధించక ముందు నీళ్లు లేక, నిధులు రాక, ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక కటిక దరిద్రం అనుభవించారన్నారు. రాష్ట్రం సిద్ధించాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వొచ్చామన్నారు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వాన వచ్చిన వరదొచ్చినా నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నానన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇంటింటికి నీరు అని హామీ ఇచ్చి మిషన్ భగీరథతో తెలంగాణ ఆడపడుచులు బిందెలతో నీళ్లు మోయకుండా చూశానన్నారు. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులను నింపడం ద్వారా తెలంగాణలో రెండు పంటలు పండి సస్యశ్యామలంగా తయారిందన్నారు. వైయస్ షర్మిల పెద్దిపై పగబట్టిందని, కట్టల సంచులు పంచి ఓడించాలని చూస్తుందని కెసిఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ కుట్రలన్ని పటాపంచలు చేస్తూ భారీగా సీట్లు గెలవడం ఖాయం అని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. డిసెంబర్ 3న బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టే విధంగా ఫలితాలు వెలువడుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యమంలో నా కుడి కన్ను దెబ్బతింది..సరిగా కనిపియదు…అయినా మీరే నా బలం, నా బలగం : పెద్ది సుదర్శన్ రెడ్డి
ఉద్యమంలో తన కుడి కన్ను దెబ్బతిందని, సరిగా కనిపియదని బీఆర్‌ఎస్ నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజలే తన బలం, తన బలగమని, తనను ఈసారి కూడా మీరు ఆశీర్వదించాలని ఆయన కోరారు. తాను నిస్వార్థ రాజకీయ నాయకుడినని అన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేశాన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలో తన కుడి కన్ను దెబ్బతినడంతో సరిగ్గా కనబడదని, నమస్కారం పెట్టడం లేదని ఎవ్వరూ కూడా అన్యధా భావించవొద్దని కోరారు. తన ఆస్తి, తన బలగం ప్రజలేనని అన్నారు. తన జీవితం కేసీఆర్‌కి, ప్రజలకు తెలియంది కాదన్నారు. ప్రజలందరి సంపూర్ణ ఆశీర్వాదం కావాలని కోరుతున్నానన్నారు. నిత్యం ప్రజల వెంట, ప్రలజ మధ్యనే ఉన్న వ్యక్తినని, వేరే జెండా, ఎజెండా లేని వ్యక్తినని ఆయన అన్నారు. ఆశీర్వాద సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, బండ ప్రకాష్, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, సిరికొండ మధుసూదనా చారి, సీతారాం నాయక్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.





