భూమ్మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికీ ఒక్కటే

పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ
దివ్య మాతృత్వం’ అనే పుస్తకం ఆవిష్కరణ
పత్రీజీ శక్తి స్థలల్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి
ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 :  ఈ భూమి మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికి ఒక్కటేనని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ అన్నారు. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వర పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం 11 రోజుల వేడుకలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. గురువారం ప్రపంచ నలుమూలల నుంచి ధ్యానులు హాజరై పత్రీజీ శక్తి స్థల్ వద్ద నివాళ్లర్పించారు. ఉ.5 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రాతఃకాల ధ్యానానికి వేల మంది ధ్యానులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పరిమళ పత్రీ మాట్లాడుతూ పత్రీజీ శక్తి స్థల్ ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇన్నింటిలో మంచిని చూడటమే నిర్వాణ స్థితి అని అన్నారు. నేను ఆత్మనని ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో భయ రహిత జీవితం అనుభవంలోకి వస్తుందని అన్నారు. ఆధ్యాత్మికతతోనే సరియైన మిత్రత్వం లభిస్తుందని అన్నారు. బ్రహ్మర్షి పిరమిడ్ లక్ష్మీ రచించిన ‘దివ్య మాతృత్వం’ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నండూరి శ్రీనివాస్ ప్రవచనాలు ధ్యానుల్ని ఆకట్టుకున్నాయి. సింగర్ కృష్ణ చైతన్య తన పాటలతో ధ్యానుల్ని ఉర్రూతలూగించారు. పరిణిత పత్రీ మాట్లాడుతూ నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ ఫియరెన్స్ అనే సూత్రాలతో ముందుకు వెళ్లాలని అన్నారు. జంతువుల శాలలు మూత పడినప్పుడే ప్రపంచంలో శాంతిని నెలకొంటుందని అన్నారు. ఊహ శక్తికి ధ్యానం తోడైతే అసాధ్యం కానిది ఏది లేదన్నారు. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి మాట్లాడుతూ పత్రీజీ ఎన్నో అద్భుతాలు సృష్టించారని, అందులో ఓ అద్భుత అద్భుతం పిరమిడ్ పార్టీ అని అన్నారు. ఉన్నత పదవుల్లో ఆధ్యాత్మిక యోగులు ఉంటే నిస్వార్థ సేవలు అందిస్తారని అన్నారు. ప్రతి పిరమిడ్ క్షేత్రం ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ప్రతీ ఆదివారం శాకాహార ర్యాలీలు, చార్మినార్లో ఆగస్టు 15 కి ఒక లక్షల మందితో శాకాహార ర్యాలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పత్రీజీ శక్తి స్థల్ ప్రాజెక్టుకు ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కళాకారులు, కవులు, ఆధ్యాత్మిక వేత్తలను పిరమిడ్ నిర్వాహకులు సత్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఆధ్యాత్మిక గీతాలు, ధ్యాన గురువుల సందేశాలతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, కిషన్ రెడ్డి, మారం శివ ప్రసాద్, నవకాంత్, రాయ జగపతి రాజు తదితర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *