ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా తాము కొనుగోలు చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని భూమిలోకి తమను వెళ్ళనియకుండా అతని అనుచరులు, మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, ఎన్.దయాసాగర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సుంకరి బాలమ్మ, భర్త సుంకరి మల్లేష్, సుంకరి నర్సింహా కుటుంబ సభ్యుల నుండి భూమి కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. తాము కొన్న భూమి పక్కన ఉన్న రెండెకరాల భూమిని గతంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరుపై కొనుగోలు చేశాడని తెలిపారు. కాగా తాము కొనుగోలు చేసిన భూమిపై మంత్రి బామ్మర్ధి శ్రీనివాస్ రెడ్డి కన్నేశాడని ఆరోపించారు. ఈ విషయంపై పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మంత్రి ఒత్తిడితో వారు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి , అతని స్నేహితుడు సురేష్ రెడ్డిలు తమను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దరణి రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని తెలిపారు. కానీ తమను పొజిషన్ లోకి వెళ్ళనియకుండా భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమలాగే చాలా మంది బాధితులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారని, కానీ భయపడి ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించి, తమ భూమిను తమకు అప్పగించాలని వేసుకున్నారు.




