బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
గౌతముడనే మునికి శరద్వంతుడనే కుమారుడు కలిగాడు. అతడు శరములతో బాణములతో పుట్టాడట. అందుకే అతనికాపేరు వచ్చిందన్నారు. శరద్వంతుడు తపస్సు చేస్తుండగా, ఇంద్రుడు వాని తపమునకు భయపడి జలపది అనే అప్సరసను పంపాడు. శరద్వంతుడు ఆమె అందానికి చలించాడు. కామంతో వివశుడైనాడు. అతనిచేతినుండి ధనుర్భాణాలు జారిపోయినవి. వీర్యపాతం జరిగింది. ఆ వీర్యము రెల్లుదుబ్బుపై రెండు భాగాలుగాపడింది. వాటి నుండి ఒక బాలుడూ ఒక బాలికా జన్మించారు. శంతన మహారాజు వీరద్దరినీ చూసి జాలిపడిపెంచాడు. శంతనుడు కృపతో పెంచాడుగావున ఆ బాలుడికి కృపుడనే పేరు వచ్చింది. ఆ బాలిక కృపి అయ్యింది. శంతనుడు వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. భీష్ముడు కృపాచార్యుల వద్దనే పాండవులకూ కౌరవులకూ విద్యలు నేర్పించెను. యాదవులు కూడా కృపాచార్యుల దగ్గర విద్య నభ్యసించిన వారిలో ఉన్నారు.
ఇక ద్రోణుడి గురించి క్లుప్తంగా తెల్సుకుందాం. భరజ్వాదుడనే మహర్షి గంగా స్నానం చేస్తున్న సమయంలో ఒక అప్సర వచ్చింది. ఆమెను చూసి కామవివశుడయ్యాడు. అతడి వీర్యం పడిపోతుంటే దాన్ని ద్రోణమున వుంచాడట. దాంట్లో ఒక బాలుడు పుట్టాడు. అతడికి ద్రోణుడు అని పేరు పెట్టాడు. భరద్వాజునివద్ద ద్రోణుడూ, ద్రుపదుడూ విద్యాభ్యాసం గావించారు. ద్రోణుడు కృపుడి సోదరి యగు కృపిని వివాహం చేసుకున్నాడు. వారిరువురికీ అశ్వత్థామ అనే పుత్రుడు కలిగాడు. ద్రోణుడు పరశురాముని వద్ద దివ్యాస్త్రముల ప్రయోగ ఉపసంహార మంత్రములను గ్రహించెను. ధనుర్విద్యా రహష్యాలను కూడా తెల్సుకున్నాడు. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు.
ద్రోణుడు అవమాన భారంతో హస్తినాపురం వచ్చాడు. ద్రుపదుడు తనకు గావించిన అవమానం మర్చిపోలేకుండా వున్నాడు.
కురుకుమారులు ఒక రోజున బంతితో ఆడుకుంటూవున్నారు. ఆ బంతి నూతిలో పడింది. ఎలా బంతిని బయటకు తీయాలా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ద్రోణుడు ఆ వైపు వచ్చాడు. ద్రోణుడు తాను బంతిని తీస్తానని చెప్పాడు. చేతిలో ఉన్న దర్భలను ఒక దాని వెనుక ఒకటి విడిచిపెట్టాడు. ఒక దర్భ బంతికి గుచ్చికుంది. ఆ దర్భకు మరో దర్భదానికి మరోదర్భ అలా ఒకదానికొకటి అంటుకుపోయాయి. ఆ బంతిని తీసి బాలురకిచ్చాడు ద్రోణుడు. రాజకుమారులకు ఆశ్చర్యం వేసింది. ద్రోణుని వారు భీష్ముని వద్దకు తీసుకువెళ్ళారు. భీష్ముడు ద్రోణుని తన ఆస్థానంలో విద్యాగురుపీఠం అలంకరించాల్సిందిగా కోరాడు. ద్రోణుడు వారిని శిష్యులుగా స్వీకరించాడు.
(తరువాయి…వొచ్చేవారం)




