భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటలైన ప్రత్తి, కంది, మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు నుండి మురుగు నీటిని తీసివేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు 25 కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్ ను పైపాటుగా 20 రోజుల వయస్సున్న పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం. మీ. ధూరంలో పాదులు తీసి ఎరువులను వేసి మట్టితో కప్పవలెనని తెలిపారు. పంట త్వరగా కొలుకోవడానికి 19:19:19 లేదా 10 గ్రా. మల్టీ-కె (13-0-45) లేదా 20 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేయాలని, చీడపీడల ఉదృతి పెరగకుండా 2.5 గ్రా. కార్బెండజిమ్+ మాంకోజెబ్ లేదా 2 మి. లి పిఫ్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని ఆయన సూచించారు. అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘవృత్తంమై ఉండడం వలన ప్రత్తిలో వడలు తెగులు సోకుటకు అవకాశం ఉన్నందున, నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సీ –క్లోరైడ్ మందును ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ చుట్టూ తడపవలెనని అన్నారు.
కంది : – ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో కంది ఫైటోఫ్తోరా ఎండు తెగులు ఆశంచడానికి అన కూలం, తెగులు గమనించినచో నివారణకు, 3 గ్రా. కాపర్-ఆక్సీ –క్లోరైడ్ మందును ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ చుట్టూ తడపవలెనని, వర్షాలు ఆగిన తర్వాత, నేలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా. మల్టీ-కె (13-0-45) మంద్ న ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.
మొక్కజొన్న: పంట లేత దశలో తేమకు చాలా సున్నితం మరియు అధిక నీటి నిలువను తట్టుకోలేదు, కావున పొలం నుండి మురుగు నీటిని వీలైనంత త్వరగా తీసివేయాలని, ఈ సమయంలో అధిక తేమ వలన భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఉదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది, కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా. DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ ను వెసుకోవాలని అన్నారు. తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న రకాలను జులై 31 వరకు విత్తుకోవచ్చని సూచించారు.
సోయాచిక్కుడు: పంటలో ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులు గమనించినట్లైతే 2.5 గ్రా. కార్బెండజిమ్+ మాంకోజెబ్ లేదా 2 మి. లి పిఫ్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని అన్నారు.
వరి: ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్దతిలో విత్తుకోవడం వలన సమయం మరియు పెట్టుబడి ఆదా చెసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారి రైతులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *