లౌకిక ప్రజాస్వామ్యానికి బిజెపి ప్రమాదకరం : పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
ఎలక్ట్రొరల్ బాండ్స్ తో అవినీతిని చట్టబద్ధం: వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్
ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూల్చిన బిజెపి: ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి
తెలంగాణ జనసమితి వర్క్ షాప్‌లో వక్తలు
నాంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : పార్లమెంట్ ఎన్నికల నేపద్యం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో నిర్వహించిన ‘ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో పలువురు వక్తలు మాట్లాడారు .ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాడు. అందరికీ అవకాశాలు కల్పిస్తానని, పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని చెప్పి గద్దెనెక్కి నేడు ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచాడే తప్ప తాను చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తాము అధికారంలోకి వొస్తే అవినీతిని అంతమొందించి విదేశాల్లో ఉన్న అక్రమ ధనాన్ని దేశానికి తెచ్చి, ప్రతీ పౌరుని ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేసి ఆర్ధికంగా పరిపుష్ఠత చేకూరుస్తానని గొప్పగా చెప్పాడు.
ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కరి ఖాతాలో పైసలు జమ కాలేదు. ఆకర్షణీయంగా వేషభాషలు మారుస్తూ మోదీ గంభీరమైన ఆహార్యంతో, ముచ్చటైన పదాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ఆడుతున్న డ్రామా అంతా ఇంతా కాదు. ఈ నినాదం అర్థం స్వదేశీ పరిశ్రమలను పెంచడం కాదు దేశంలో వ్యాపారం చేయడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించుతున్నారు. విదేశీ పెట్టుబడులతో దేశం అభివృద్ధి సాధిస్తుందన్న అబద్ధపు ప్రచారంతో దేశీయ ఉత్పత్తి, దేశీయ పెట్టుబడి గాలికి వదిలేశాడు. మరొకవైపు మేకిన్ ఇండియా అంటూనే స్వావలంభన చేకూర్చిన, లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మి వేస్తున్నాడు. కార్పొరేట్లకు సకల సౌకర్యాలతో పాటు భూమిలేని పేదలకు ఇవ్వాల్సిన భూములను కూడా దానం చేస్తున్నాడు. ఆఖరికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టించి అటవీ భూమిని ఈ కార్పోరేట్లకు అప్పచెప్తున్నాడు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జీ.ఎస్టి లాంటి పన్నులను ప్రజల మీద రుద్దిండు. ఫలితంగా స్వయం ఉపాధి రంగంలోని చిన్న వ్యాపారాలు కుప్పకూలిపోయాయి. ఈ కొత్త పన్ను వలన అన్ని రంగాల్లో ధరలు పెరిగి సామాన్యుడు మరింత ఇబ్బంది పడుతున్నాడు. మోదీ చెబుతున్న అభివృద్ధి నమూనా దేశంలో స్వావలంభనను చేకూర్చడంలోనూ, అభివృద్ధిని సాధించడంలోనూ విఫలమైంది అని విమర్శించారు.
కార్పొరేట్లకు దోచిపెట్టి నిరుద్యోగులకు మోసం..
టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు తాను అధికారంలోకి వొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో లక్షలాది శాశ్వత ఉద్యోగులను వి.ఆర్.ఎస్ తదితర పేర్లతో తొలగించారు. పర్మనెంట్ పోస్టులకు నీళ్లు వదిలి తాత్కాలిక జాబ్ మేలా ల పేరుతో కొత్త తరహా ఉద్యోగాలకు తెరలేపిండు. ఆఖరుకు అగ్నిపత్ పేరుతో సైన్యం లోని ఉద్యోగాలను తాత్కాలిక ఉద్యోగాలుగా మార్చిండు. వివిధ సర్వేల నివేదికల ప్రకారం దేశంలో 2.7 లక్షలు శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోయాయి. రైతాంగానికి ఉరివేస్తూ, భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్ శక్తులకు అప్పగించే మూడు చట్టాలను తీసుకువొచ్చి కనీస మద్దతు ధర అడిగిన రైతులపై అక్రమ కేసులతో నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కులను తూట్లు పొడిచారు. ఈ నిర్ణయాల వలన దేశంలో అసమానతలు పెరిగాయి. ఈ రోజు 162 మంది బిలియనీర్లు 25 ఉత్పత్తిని 48 శాతం సంపదను అనుభవిస్తున్నారు.
అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజలు 15 ఆదాయం 6.4 శాతం సంపదను పొందుతున్నారు అని విమర్శించారు. బి.జే.పి దాని పరివారము భావోద్వేగాల ప్రచారాల మాటున ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. పాలనలో రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. అన్ని రంగాలలో ఈ ఎజండానే అమలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తూ, వాటిని చెప్పుచేతల్లో పెట్టుకొని, ఇష్టానుసారంగా నడుపుతున్నారు. ప్రణాళికా సంఘం, సి.బి.ఐ, సి.వి.సి, ఈ.డి, ఆర్.బి.ఐ, చివరికి న్యాయ వ్యవస్థ వంటి స%శీ%స్థలపై పట్టు బిగించి వాటి స్వతంత్రను సైతం దెబ్బతీశారు. భారత ప్రజాస్వామిక, లౌకిక, సామాజికన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో కేంద్ర మంత్రులు ప్రకటిస్తున్నారు. అని అన్నారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ అన్ని కంపెనీలను గుజరాత్ కే తరలిస్తున్నారు. మొన్న మూడు చిప్ తయారు చేసే కంపెనీలు వొస్తే రెండు గుజరాత్ కు, ఒకటి అస్సాంకు వెళ్లినాయి.
ఐటి రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న తెలంగాణకు మొండి చెయ్యి చూపించారు. చాలా రంగాలలో ఇదే దుస్థితి కొనసాగుతున్నది. కార్ల కంపెనీ టెస్లాను కూడా గుజరాత్ కే తరలిస్తున్నారు. పన్ను రాయితీలు ప్రకటించే అధికారాన్ని వాడుకొని అన్ని విదేశీ కంపెనీలను గుజరాత్ కే తీసుకువెళ్తున్నారు. విభజన చట్టం ప్రకారం రావలసిన హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటికీ రాలేదు. ఖాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం జోక్యం చేసుకుని వేరే రాష్ట్రానికి తీసుకొని వెళ్ళింది. హైదరాబాద్ లో ఏర్పడాల్సిన ఐటిఐఆర్ కారిడార్ ను రద్దు చేసినారు. కృష్ణా నదిలో తెలంగాణకు వొచ్చే న్యాయమైన వాటా పంచి ఇవ్వలేదు. అసమాన పంపిణిని పదేళ్లుగా యధాతధంగా కొనసాగిస్తున్నారు అని విమర్శించారు. మరో వైపు తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తూ తెలంగాణ చరిత్రను వక్రీకరించి నిరంకుశంగా అధికారం చెలాయించిన కెసిఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అంటూ కారు కూతలు కూస్తున్నాడు. బీ.ఆర్.ఎస్, బి.జే.పిలు ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయి. ఒకదానికొకటి అంతర్గతంగా సహకరించుకుంటూ బహిరంగంగా మాత్రం కొట్లాటను నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి.
మోదీ తీసుకొ చ్చిన ప్రతీ ప్రజావ్యతిరేక బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు తెలిపింది బీ.ఆర్.ఎస్. ఈ రెండు పార్టీలు కాంట్రాక్టర్ల, గుత్తేదారుల కొమ్ముకాస్తున్నవి. మోదీ ఆదాని, అంబానీలకు, కెసిఆర్ మెగా క్రిష్ణారెడ్డి, హెటిరో లాంటి వారికి వివిధ పేర్లతో ప్రజా వనరులను అప్పనంగా అప్పగిస్తున్నారు. ఇద్దరూ క్విడ్-ప్రొ-క్రో అమలు చేస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వీరి బాగోతాన్ని, కార్పొరేట్లతో ఉన్న అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది. ఈ రెండు పార్టీలు అణచివేతనే ఆయుధంగా అప్రజాస్వామిక పాలనా విధానాన్నే కొనసాగించాయి. చివరికి ఫోన్ ట్యాపింగ్ లు చేసి ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే కాకుండా ప్రజల వ్యక్తిగత జీవితంలోకి జొరబడే స్థాయికి బరి తెగించారు. అని అన్నారు.
ఒకరేమో విధ్వేషాలను రెచ్చగొట్టి, మరొకరేమో తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. కేసీఆర్ ఎన్ని అడ్డదారులనైన తొక్కి, విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించి కొన్ని సీట్లు సంపాదించి, కేంద్ర ప్రభుత్వంతో బేరాలాడి, తాను గత పదేండ్లు చేసిన అక్రమాల నుండి, కాళేశ్వరం కుంభకోణం నుండి రక్షణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. బీ.ఆర్.ఎస్ గెలుపు తెలంగాణకు ఏ విధంగానూ ఉపయోగం లేదు. బి.జే.పికి వోటు తెలంగాణకు ఆయువు పట్టు అయిన గంగా జమున తేహజీబ్ ను, దక్కన్ జీవన సాంస్కృతిక విధానాన్ని, తెలంగాణ ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. అన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్ రావు, కన్నెగంటి రవి, అంబటి నాగయ్య,అంబటి శ్రీనివాస్, ధర్మార్జు న్, బైరి రమేశ్, సలీం పాష, నిజ్జన రమేశ్, ఆశప్ప, ముక్కెర రాజు, అరుణ్, కంతి మోహన్ రెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.




