- భారీ ఏర్పాట్లకు శ్రీకారం
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్
కాంగ్రెస్ అధినేత, యువ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు షాద్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర విభాగాల బాధ్యుల ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల మీదుగా షాద్‌నగర్ నియోజకవర్గంకు 29వ తేదీన రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్నదని వివరించారు.
రాహుల్ పాదయాత్రకు ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు. అదే విధంగా ఆయన నైట్ హాల్ట్ షాద్‌నగర్‌లోనే చేస్తారని పేర్కొన్నారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వాగతం ఉంటుందని తెలిపారు. అదే విధంగా వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ పాదయాత్రలో సమావేశం అవుతారని తెలిపారు. ఇందులో 10 ముఖ్యమైన అంశాలపై ఆయన చర్చించబోతున్నారని పేర్కొన్నారు. యాత్ర విజయవంతం చేసేందుకు నియోజకవర్గ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, రైతు విభాగం, కార్మిక సంఘం, మహిళా విభాగం, ఎన్ ఎస్ యుఐ తదితర విభాగాల ఆధ్వర్యంలో శ్రేణులు కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఒకరికి మతపిచ్చి…మరొకరికి ప్రాంతీయ పిచ్చి
భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీ మత పిచ్చితో వ్యవహరించి దేశాన్ని విడగొట్టి ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధినేతకు ప్రాంతీయ పిచ్చి ఉందని వీర్లపల్లి శంకర్ ఘాటుగా విమర్శించారు. ఒకవైపు దేశాన్ని, మరోవైపు ప్రాంతాలను, కుల, మతాలను ముక్కలుగా చేస్తున్న ఈ సమయంలో ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్యమత్యంతో ముందుకు సాగే విధంగా కృషి చేసేందుకే దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపడుతున్నారని శంకర్ స్పష్టం చేశారు.
శంకర్ నోట విభేదాల మాట
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో అంతర్గత విభేదాలు ఉండొచ్చని, ఆధిపత్య పోరు కూడా ఉందని అయితే వీటిని పక్కనపెట్టి పార్టీ అధినేత వొచ్చినపుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఒడిదుడుకులకు గురికాకుండా కలిసికట్టుగా అందరూ కాంగ్రెస్ పార్టీ అభివ ృద్ధికి ప్రతిష్టకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొంకళ్ళ చెన్నయ్య, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, స్థానిక మండల, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




