భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం

 

నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…

 

అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది

 

కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..

 

కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ

 

32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర

 

పాల్గొన్న జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ ‌‌శ్రీనివాస్‌

 

‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌భారత్‌ ‌జోడో యాత్ర 2024 ఎన్నికల కోసం కాదని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న దేశ విభజనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలని కాంగ్రెస్‌ ‌కోరుకుంటుందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శనివారం కర్ణాటకలో భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా తురువెకెరేలో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటానికి సామాన్య ప్రజలు తనను యాత్రకు ప్రేరేపించారని అన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న దేశ విభజనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్‌ ‌కోరుకుంటున్నట్లు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రంలోని విభజన రాజకీయాలను ఎదుర్కునడానికి, ఆర్థిక అసమానతలు, రాజకీయ కేంద్రీకరణ తదితర ప్రమాదాల నుండి దేశ ప్రజలను మేల్కొల్పడానికి ‘భారత్‌ ‌జోడో యాత్ర’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, శశి థరూర్‌ల విషయమై రాహుల్‌ ‌మాట్లాడుతూ పార్టీ చీఫ్‌ను గాంధీ కుటుంబం రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌చేయగలదని కొన్ని వర్గాల నుండి వొచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. పోరులో ఉన్న ఇద్దరు నేతలూ ఉన్నత స్థాయి, అవగాహన ఉన్న వ్యక్తులని, వారిని ఎవరూ నియంత్రించలేరని అన్నారు. ఈ రకమైన ఆరోపణలు వారిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాపై రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ ద్వేషం, హింసలను వ్యాప్తి చేయడం దేశ వ్యతిరేక చర్య అని, అందులో మునిగితేలిన వారితో తాము పోరాడుతామని అన్నారు.

 

ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తి ఎవరన్నది, వారు ఏ వర్గానికి చెందిన వారనేది ముఖ్యం కాదని, వాటిని వ్యాప్తి చేయడం దేశ వ్యతిరేక చర్య అని, అలాంటి వారిపై పోరాడతామని అన్నారు. జాతీయ విద్యా విధానంపై రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ కొత్త విద్యా విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నాని, ఆ విధానం మన దేశం యొక్క ధర్మంపై దాడి చేసేదిగా, మన చరిత్రను వక్రీకరించేదిగా, కొందరి చేతిలో అధికారాన్ని కేంద్రీకరించే విధంగా ఉందని ఆరోపించారు. మన సంస్కృతిని ప్రతిబింబించే వికేంద్రీకృత విద్యా వ్యవస్థ కావాలని అన్నారు. తన మరియు పార్టీ సిద్ధాతాలను బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇష్టపడటం లేదని అందుకే తమ ఇమేజ్‌ను కించపరచడానికి వేల కోట్ల మీడియా డబ్బును, శక్తిని వెచ్చిస్తున్నారని రాహుల్‌ ‌దుయ్యబట్టారు. బ్రిటిష్‌ ‌వారి నుండి స్వాతంత్య్రం కోసం భారత స్వాతంత్య్ర పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహకరించలేదని గాంధీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్రిటీష్‌ ‌వారికి సహాయం చేసిందని, అలాంటి వాస్తవాలను బీజేపీ దాచిపెట్టలేదని అన్నారు. యాత్రలో తాను ఒంటరివాడిని కాదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగి వేసారిన లక్షలాది మంది యాత్రలో పాల్గొంటున్నారని అన్నారు. కాగా భారత్‌ ‌జోడో యాత్ర ప్రారంభించిన తర్వాత ఇది రాహుల్‌ ‌గాంధీ పాల్గొన్న మూడవ పత్రికా విలేఖరుల సమావేశం.

 

కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..

 

తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నానని రాజస్థాన్‌లో ఆదానీ పెట్టుబడులపై రాహుల్‌ ‌స్పందించారు. బిజెపి కొందరికే కేటాయింపులు చేయడాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తానని అన్నారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీని రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌ప్రశంసించడంపై రాహుల్‌ ‌గాంధీ స్పందిస్తూ..అదానీ రాజస్థాన్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చారని, దీనిని తిరస్కరించడం ఏ ముఖ్యమంత్రికైనా తగినది కాదని చెప్పారు.

 

యాత్రలో పాల్గొన్న జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ ‌శ్రీనివాస్‌

 

‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర 32వ రోజు కూడా వేలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్ధదారులు వెంటరాగా కర్నాటకలో ఉత్సాహంగా కొనసాగింది. అయితే అసమ్మతి జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ ‌శ్రీనివాస్‌ ‌రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురి చేసింది. శ్రీనివాస్‌ ‌రాహుల్‌ ‌గాంధీ పక్కన నడుస్తూ మాట్లాడుతుండడడంతో అతను త్వరలో తన పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతాడనే ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *