- రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్ పాద యాత్ర
- డీడ్వానాలో రైతులతో సమావేశం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 15 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ప్రారంభించిన యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగి ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో కొనసాగుతున్నది. డిసెంబర్ 24న యాత్ర దిల్లీలో ప్రవేశించి 8 రోజుల విరామం అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రవేశించి హర్యానా, పంజాబ్‌లలో కొనసాగి జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశించి 2023 ఫిబ్రవరి మొదటి వారంలో కాశ్మీర్‌లో ముగుస్తుంది. ఇప్పటి వరకు యాత్ర అసాంతం రాహుల్ గాంధీ పెరుగుతున్న గడ్డంతో టీషర్ట్ వేసుకుని కొనసాగించడం విశేషం.
100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా జైపూర్‌లో గాయకుడు సునిధి చౌహాన్‌తో ఒక కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు ఎఐసిసి జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ వెల్లడించారు. కాన్సర్ట్‌లో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు, మధ్యాహ్నం ఒంటి గంటకు దౌసాలో రాహుల్ విలేఖరుల సమావేశంలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా రాజస్థాన్‌లో 11వ రోజు యాత్ర గురువారం ఉదయం లాల్‌సోట్ నియోజక వర్గం గోలియా గ్రామం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లాల్‌సోట్ పట్టణం గుంఆ ప్రయాణిస్తూ 14 కిలోమీటర్ల మేర కొనసాగి డీడ్వానా అగ్రికల్చర్ కాలేజ్ వద్ద విశ్రమించింది. అక్కడ భోజనం అనంతరం రాహుల్ గాంధీ రైతులతో సమావేశమయ్యారు.
ఉదయం విరామం అనంతరం యాత్ర మధ్యాహ్నం 3.30కు సలేమ్‌పురా గ్రామం నుంచి ప్రారంభమయి 9 కిలోమీటర్ల మేర కొనసాగిన అనంతరం నయావాస్ బస్ స్టాండ్ గుండా కొనసాగి దౌసా నియోజకవర్గంలోకి ప్రవేశించి నాంగల్ రాజ్‌వతాన్ మీనా హైకోర్ట్‌లో రాత్రి బసకు ఆగింది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటి సిఎం సచిన్ పైలట్, పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ జోటస్ర, మంత్రి పర్‌దాసీ లాల్ మీనా, పార్టీ స్థానిక నేతలు, వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




