పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం
నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి
సికింద్రాబాద్ యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని తెలిపారు. రోజులో కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. యోగా దినోత్సవం నిర్వహిస్తున్న ఆయుష్, సాంస్కృతిక శాఖలను అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొదించడానికి యోగా ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని సూచించారు.
పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం యోగా అని…దీనిని మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగా విశిష్టితను తెలియజేసేలా వివిధ ఆసనాలు వేశారు. యోగం అంటే సాధన చేయడం. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం. యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిది. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది. కుల మతాలకు అతీతమైనదని ఆయన తెలిపారు. యోగా. ఇది ప్రపంచ దేశాల్లో శాంతికి దోహదం చేస్తుంది. ఏ స్థాయిలో ఉన్నా యోగా సాధన తప్పనిసరి. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదన్నారు. పెద్దలు మనకు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రపంచ శాంతిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని, యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చని వెంకయ్యనాయుడు అన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో తర్వాత ప్రజలతో కలిసి వెంకయ్య, ఇతర నేతలు ఆసనాలు వేశారు. కార్యక్రమంలో అతిథులను శాలువా, మెమొంటోతో కిషన్ రెడ్డి సత్కరించారు. యోగా దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. అప్పుడప్పుడు కాకుండా.. రోజూ సాధన చేస్తూ ఉండాలని చెప్పారు. యోగాతో శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉంటామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీసింధు, సినీ హీరో అడవి శేష్ యోగా డేలో పాల్గొన్నారు.



