ఒకప్పుడు…
ఉద్యమాలే ఊపిరిగా
ఆశయ సాధనే లక్ష్యంగా
పరుగెత్తిన కాలం,
కట్లు తెంచుకున్న ఆబోతు
ఊరిమీద పడితే జనం భయపడ్డట్టు
పాలకులకు భయపడి,
కుట్రల సాలెగూటిలో చిక్కుకొన్న
ఉద్యమాలు
రెక్కలు తెగిన పక్షులై
విలవిల్లాడుతోంటే,
చతికిలపడింది నేడు.

ఓ ఉద్యమకారుడా!
నోటికి తాళం వేసుకొని
గొంతుక మట్టితో పూడ్చుకొని
ఈ రోజు గడిస్తే చాలనే
బానిసబతుకు ఎంతకాలం?
నీ ఆశలు మళ్ళీ చిగురించాలన్నా,
నీ బతుకులో
వెన్నెల విరిజల్లులు కురియాలన్నా,
నియంతృత్వ పోకడలకు వెరవక,
నీవున్నది  ప్రజాస్వామ్యంలోనని మరువక
ముందు నీ నోటికి వేసుకున్న తాళం తీయి.
తరతరాల వారసత్వ సంపదైన
ప్రశ్నించే హక్కును పరిరక్షించు.
ఉద్యమ కెరటాలు
తిరిగి ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి
నడుం బిగించు,
చతికిలపడ్డ కాలాన్ని
తిరిగి పరుగెత్తించు.
పోరాడితే పోయేదేమీ లేదు
పోయేది నియంతృత్వం,
వచ్చేది
న్యాయమైన కోర్కెల సాకారం.

–  వేమూరి శ్రీనివాస్‌, 99121 28967,    
    ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *