నేనొక పిరివాడ్ని…
కళ్ళూ,కుతంత్రాలే
శ్వాస,ధ్యాసగా కల్గి,
ద్వేషాలు,మోసాలు రాజ్యమేలుతూ,
అరిషడ్వర్గాలు
తమ ప్రతాపం చూపిస్తోన్న
నేటి సమాజంలో
నా బతుకు నేను బతకలేని పిరివాడ్ని.
ఓట్లు కొని కాట్లు వేస్తూ
అందలమెక్కి మెక్కే,
స్వార్థపరుల్ని ప్రశ్నించే సత్తువ లేని
పిరికి పౌరుడ్ని.
అడుగడుగునా
అబద్ధాల పంజా విసురుతూ,
మానవీయ విలువలకు
తిలోదకాలిస్తూ,
చర్మం దళసరెక్కిన
దుస్సాహస దున్నపోతుల చేతుల్లో
వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతోంటే,
సరిదిద్దాల్సిన వారే
పదవులకు గులాములైపోతూ,
స్వార్ధ,స్వలాభాలకోసం
వినాశకారికి సాగిలపడి
వటవృక్షానికి పట్టిన
చెదపురుగుల్లా మారిపోగా,
దూరదృష్టి లోపించిన జనావళి
తాత్కాలిక ఆనందమే ముద్దంటూ
వేటగాడు విసురుతోన్న
సంక్షేమ రూకల నూకలకోసం
ఎగబడుతోంటే,
నా భవిష్యత్ తరాల భవిష్యత్తుకై
నా మనసు పడే వేదన
ఎవరికి చెప్పుకోవాలి?
అందుకే…
నిజంకాని
ఉచితాల అజ్ఞానపు సమాజంలోంచి
వాస్తవాలు వికసించే,
ఆనందం జాలువారే,
స్వేచ్చా సౌందర్యంలోకి
కదిలి వెళ్లిపోవాలని ఉంది.
నేనొక పిరివాడ్ని.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




