43 అడుగులతో మొదటిప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు
భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20 : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 36 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 44 అడుగులకు చేరుకుంది.ఇది అర్ధరాత్రి మరింత పెరిగి శుక్రవారం ఉదయానికి 46 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. దీనితో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. ఈ వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కులనీటిని దిగువ భాగానికి విడుదల చేసారు. అలాగే తాలిపేరు ప్రాజెక్టు నుండి 24 గేట్లు ఎత్తివేసి 10,20,099 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. దీనితో గోదావరి ప్రభావం మరింత పెరుగుతుంది. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, ఇంద్రావతి ప్రాజెక్టు నుండి భారీగా వరదనీరు చేరుకుంటుంది. దీని ప్రభావం వలన గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడే పర్యవేక్షించి ముంపుకు గురయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇప్పటికే గోదావరి 44 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ముందస్తు చర్యలకు సిద్దమయ్యారు. భద్రాచలం ఆర్డిఓ కార్యాలయం చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు,బూర్గంపాడు మండలాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసారు. ప్రజలు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కోరారు.




