భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : శనివారం మంత్రి కెటిఆర్ భద్రాచలంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం సహకరించక పోవడంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి వొచ్చింది. ఉదయం నుండి తీవ్రంగా ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కెటిఆర్ శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా భదాద్రి చేరుకుని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయాల్సి ఉండింది. అయితే ఒక్కసారిగా ఖమ్మం మరియు భద్రాచలం పట్టణాల్లో భారీ వర్షం కురవడంతో ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన అనంతరం వాతావరణం సహకరించకపోవడంతో కెటిఆర్ తన భద్రాచలం పర్యటనను అర్ధాంతరంగ రద్దు చేసుకున్నారు.
సత్తుపల్లిలో వర్ష ప్రభావం లేకపోవడంతో సత్తుపల్లిలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేసారు. ఇదిలా ఉంటే భదాద్రి రామయ్యకు తన తండ్రి వంద కోట్ల రూపాయలతో రామాలయం అంతా అభివృద్ది చేస్తామని ప్రకటించి నేటికి సుమారు 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడ రామాలయంకు కేటాయించక పోవడం స్వామివారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పుణ్యక్షేత్రమైన భద్రాచలంపై చిన్నచూపు చూడటం భదాద్రి వాసులను కూడ నిరుత్సాహపరిచింది. కేసీఆర్ ప్రభుత్వం భద్రాచలానికి చేసిన తీవ్ర అన్యాయంపై వాతావరణం కూడ సహకరించలేదనే చెప్పాలి.
కేటిఆర్ పర్యటన బందోబస్తులో విషాదం…విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ మృతి
ఐటి శాఖా మంత్రి కే.తారక రామరావు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే కేటిఆర్ పర్యటన సందర్బంగా భద్రాచలంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం వద్ద బందో బస్తు నిర్వహిస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. తరువాత వర్షం నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్లున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి(53) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది.
భారీ వర్షానికి వర్షం నీరు వేగంగా ప్రవహించడంతో కాలువలో కొట్టుకుపోయారు. ఈ విషయం గమనించిన ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా గోదావరి ఒడ్డున ఉన్న స్లూయీస్ వద్దకు మహిళా కానిస్టేబుల్ మృతదేహం చేరింది. వెంటనే మృతదేహాన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ద్వారా బయటకు తీసారు. ఈమె కొత్తగూడెం టౌన్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి మృతికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , యంపి మాలోత్ కవిత మరియు భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య తదితరులు సంతాపం తెలియచేసారు.




