- డిసెంబర్ 22న తెప్పోత్సవం..23న వైకుంఠ ద్వార దర్శనం
- 15 నుండి రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
- విలేఖరుల సమావేశంలో ఈఓ రమాదేవి దేవి
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తర్వాత అతిపెద్ద వేడుక ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు డిసెంబర్ 13వ తేది నుండి 2024 జనవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ స్థలసాయి, రామం, ఈఓ రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… డిసెంబర్ 13 నుండి పగల్ పత్తు ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారి అవతారాలు ప్రారంభం అవుతాయని, 22న స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతుందని, 23 తెల్లవారు జామున ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభం అవుతాయని అన్నారు. 2024 జనవరి 3 నుండి 5 వరకు విలాసోత్సవములు, 8వ తేది విశ్వరూప సేవ జరుగుతుందని పేర్కొన్నారు.
28న శబరి స్మృతి యాత్ర
ఈ నెల 28 ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని శబరి స్మృతి యాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. అదే రోజు పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకే మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుందని అన్నారు. 29వ తేది ఆదివారం ఆలయ సంప్రోక్షణ కారణంగా స్వామివారి మూల వరుల అభిషేకనికి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
15 నుండి అంగరంగ వైభవంగా శరన్నవ రాత్రి మహోత్సవాలు
రామాలయంలో ఈ నెల 15 వ తేది నుండి 24 వ తేది వరకు శరన్నవ రాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ ఓ తెలిపారు. దీనిలో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుండి 4.30 వరకు అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి రోజు శ్రీమద్రామాయణ పారాయణ జరుగుతుందని తెలిపారు.24వ తేది విజయ దశమి ని పురస్కరించుకొని దసరా మండపం వద్ద శ్రీ రామ లీలా మహోత్సవం జరప బడుతుందని పేర్కొన్నారు.





