- లక్షల మందితో జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన
- ఖమ్మంలో ప్రవేశించే భట్టి యాత్రకు ఘన స్వాగతం పలకనున్న పొంగులేటి
- మీడియా సమావేశంలో మాణిక్ రావు థాక్రే
సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 28 : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాక్రే ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభలో సీఎల్పీ నేట భట్టి విక్రమార్కను స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనంగా సన్మానం చేస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిల్లగూడెం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసిసి సెక్రటీ రోహిత్ చౌదరి, భట్టి విక్రమార్కతో కలసిఇ ఆయ మాట్లాడారు. ఏఐసిసి నిర్దేశించిన మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు.
కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకెళ్లడంలో భట్టి విక్రమార్క సఫలీకృతమయ్యారని వెల్లడించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదని వివరించారు. మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జులై 2న నిర్వహించే తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు, పాదయాత్ర ముగింపు నిర్వహణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ దగ్గరుండి కోఆర్డినేషన్ చేస్తారని తెలిపారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారని తెలిపారు. భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత కొత్త కలయిక తోటి కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ కనిపిస్తుందని వివరించారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రజల భాగుకోసం యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, తెలంగాణ ప్రజలు బాగుపడలేదని అన్నారు. ప్రజల సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు, పిసిసి ఐటీ సెల్ ఛైర్మన్ మధన్మోహన్ రావు, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు.




