‌బ్రిటన్‌ ‌ప్రధానిగా భారత సంతతి రుషిసునాక్‌

28‌న ప్రమాణ స్వీకారం
మోర్తాంట్‌ ‌తప్పుకోవడంతో రుషికి మార్గం సుగమం
భారతీయ సంతతి వ్యక్తి ఎన్నిక కావడంతో సర్వత్రా హర్షం

ఎట్టకేలకు బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రుషి సునాక్‌ ఎన్నికయ్యారు. ప్రిన్స్ ‌ఛార్లెస్‌ను కలుసుకున్‌ ‌తరవాత ప్రధానిగా సునాక్‌ ‌పేరును ఆయన ప్రకటిస్తారు. అయితే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమం అయింది. ఆయనకు పోటీదారుగా నిలిచిన పెన్నీ మోర్డాంట్‌ ‌తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. భారత సంతతికి చెందిన రుషి సునాక్‌ ‌బ్రిటన్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి కాబోతున్నారు. ఆయన మొదట భారతీయ మూలాలుగల బ్రిటన్‌ ‌ప్రధాని అవుతారు. రుషి సునాక్‌ ‌సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో లిజ్‌ ‌ట్రస్‌ ‌చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆమె అనేక యూ-టర్న్‌లు తీసుకుని విమర్శలపాలై, చివరికి రాజీనామా చేశారు. దీంతో రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొందిన బ్రిటన్‌కు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించేందుకు రుషి సునాక్‌ ‌ముందుకొచ్చారు.  బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పదవికి ఎన్నికైన భారత సంతతి వ్యక్తిగా రుషి సునాక్‌ ‌సంచలనం సృష్టించారు.

గత సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో రుషి సునాక్‌ ‌పై గెలుపొంది లిజ్‌ ‌ట్రస్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆమె ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో లిజ్‌ ‌ట్రస్‌ ‌పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని లిజ్‌ ‌ట్రస్‌ ‌ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక, మాజీ ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రధాని రేసు నుంచి తప్పుకుంటు న్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌, ‌పెన్నీ మోర్డాంట్‌ ‌మధ్య పోటీ నెలకొంది. అయితే, ప్రధాని రేసులో రిషి సునాక్‌ ‌కు పోటీదారుగా నిలిచిన పెన్నీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో రిషి సునాక్‌, ‌బ్రిటన్‌ ‌ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 28న బ్రిటన్‌ ‌ప్రధానిగా రిషి ప్రమాణం చేయనున్నారు.రిషి సునాక్‌ ‌పూర్వీకులు పంజాబ్‌ ‌రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ ‌జన్మించారు. స్టాన్‌ఫర్డ్ ‌యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి.. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకాన కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 2001-04 మధ్య గోల్డ్‌మాన్‌ ‌సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు.

బ్రిటన్‌ ‌ప్రధాని కావడం అత్యంత అరుదైన సందర్భం : రుషి సునాక్‌
‌బ్రిటన్‌ ‌ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి రిషి సునాక్‌ ‌తన తొలి ప్రసంగం చేశారు. ఇది నా జీవితంలో గొప్ప అవకాశం.. బ్రిటీష్‌ ‌ప్రజలకు అనునిత్యం సేవ చేస్తానని పేర్కొన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తన శక్తిమేర పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.యూకే గొప్ప దేశమే అయినా ప్రస్తుతం మన దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మనకు స్థిరత్వం, ఐక్యత కావాలన్నారు. యూకేను ఏకతాటిపైకి తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని సునాక్‌ ‌స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించి, భవిష్యత్‌ ‌తరాలను గొప్పగా నిర్మిస్తానని చెప్పారు. కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగా తనను ఎన్నుకున్న తమ పార్టీ ఎంపీలు, నేతలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని రిషి సునాక్‌ ‌తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *