- వేలాన్ని రద్దు చేసి ఎస్సీసీఎల్కు కేటాయించాలి
- లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్ సీసీఎల్)కు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ‘అత్యవసర ప్రజా ప్రాముఖ్యత’గా లేవనెత్తిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కల్యాణఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్- నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ ఎస్‌ఎస్‌సిఎల్‌కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలిసి ఉన్నాయని ఆయన చెప్పారు. సింగరేణి ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థగా గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా లాభాలను నమోదు చేసుకుంటుందన్నారు.
అహేతుకంగా, విచిత్రమైన నిర్ణయంతో, సింగరేణి బొగ్గు బ్లాకుల పక్కనే ఉన్న బొగ్గు బ్లాకుల వేలాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీసీఎల్ ఇప్పుడు తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గును సరఫరా చేస్తుంది. ఈ బొగ్గు బ్లాకులను బొగ్గు మంత్రిత్వ శాఖ వాటిని వేలానికి పెట్టడం అభ్యంతరకర నిర్ణయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థ ఎస్సీసీఎల్కు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. గత నెలలో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం వేలం పాటకు ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం ఎస్సీసీఎల్ నుండి అభ్యర్థనలు అందాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన లిఖితపూర్వక సమాధానంలో అంగీకరించారని ఆయన చెప్పారు. పార్లమెంట్ వెలుపల ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా కేంద్రానికి ఉందన్నారు. అయితే, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఎస్‌సిసిఎల్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నాయని, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న కరీంనగర్‌లోని తాడిచెర్ల బొగ్గు గనిని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్‌సిసిఎల్ అవకాశాలను దెబ్బతీయడం ద్వారా బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ ఎంపి ఆరోపించారు.




