ప్రజాతంత్ర, నవంబర్ 02 : జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన టికెట్ ఖచ్చితంగా బిజెపి అభ్యర్థికే ఇవ్వాలని కోరుతూ గురువారం కూకట్ పల్లి అసెంబ్లీ బిజెపి కార్యాలయం వద్ద అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రేజేశ్వర్ రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీకే కూకట్ పల్లి సీటు ఇవ్వాలని నిన్న తమ పదవులకు రాజీనామా చేసామని, ఈరోజు మౌన దీక్ష చేపట్టామని, రేపు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూకట్ పల్లి నియోజకవర్గ టిక్కెట్ బీజేపీ అభ్యర్థికే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఇంఛార్జి మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయినేని సూర్య ప్రకాష్ రావు, అర్శనపల్లి సూర్యారావు, రాష్ట్ర నాయకులు, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదు వడ్డెపల్లి రాజేశ్వరరావు



