దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక
కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్ అభిమతం
ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 30 : ఒకవేళ కేంద్రంలో బీజేపీ కనుక మళ్లీ అధికారంలోకి వొస్తే రాజ్యాంగాన్ని ముక్కలుగా చించి పారేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీ పాల్గొని మాట్లాడుతూ…ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రసంగిస్తూ..రాజ్యాంగం వల్ల పేదలు, ఎస్టీలు, ఓబీసీలు అనేక హక్కులను పొందారని, రాజ్యాంగంమే ప్రజలకు మన్రేగా, భూమి హక్కులు, రిజర్వేషన్లు, తదితర అవకాశాలను కల్పించిందని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆ పార్టీ ఎంపీలు తాము మళ్లీ ఎన్నుకోబడితే, రాజ్యాంగాన్ని చింపి పారేసి, 20-25 బిలియనీర్లు దేశాన్ని నడిపించాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ పాలకవర్గం పాలకవర్గం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకపోతే, పీఎస్‌యూలు, రైల్వేలు, ఇతర ప్రభుత్వ రంగాలను ఎందుకు ప్రైవేటీకరించారని ప్రశ్నించారు.
అగ్నివీర్ పథకం ఎందుకు తీసుకొచ్చారని..కాంట్రాక్టు పద్ధతిని ఎందుకు ప్రచారం చేస్తున్నారని..రాహుల్ ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ రిజర్వేషన్లకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే మహాలక్ష్మి యోజన పథకం ద్వారా కోట్లాది మంది మహిళలను ‘‘లక్పతి’’లుగా మారుస్తామని అన్నారు. ఇందుకు గాను వారి ఖాతాల్లోకి నెలకు రూ.8,500 చొప్పున బదిలీ చేస్తుంందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 22-25 మంది పారిశ్రామిక వేత్తలను బిలియనీర్లుగా మార్చగలిగితే, కాంగ్రెస్ కోట్లాది మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ప్రస్తుతం గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయని విమర్శించారు. ఇక మోదీ దేశంలో రెండు విధాలుగా సైనికులను తయారుచేశారని, ఒకరికేమో క్యాంటీ, మంచిజీతం మొదలైన సౌకర్యాలను కల్పిస్తూ మరొకరికి ఇవేమీ లేవని, వారినే అగ్నివీరులంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. యుద్ధానికి ఇద్దరు సైనికులను పంపుతూ ఒకరికి మీకేమైనా జరిగితే ప్రభుత్వం వారి కుటంబానికి రక్షగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇస్తూ..ఇంకో సైనికుడికి యుద్ధంలో నీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించదని అంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలని ఆయన కోరారు.
అగ్నివీరులకు కనీసం అమర వీరులకు ఇచ్చేగౌరవం కూడా లభించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులు కూడా అగ్నివీర్ పథకాన్ని కోరుకోవడం లేదని రాహుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక మోదీ కొద్ది మంది బడా కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేశారని, మరి ఎంత మంది రైతుల, శ్రామికుల, నిరుద్యోగుల రుణాలు ఎంత మేరకు మాఫీ చేశారని ఆయన సూటిగా ప్రధానిని ప్రశ్నించారు. బడా కార్పొరేట్లకు మాఫీ చేసిన మొత్తం 24 సంవత్సరాలుగా కోట్లాది మంది గ్రామీణ పేదలకు మన్రేగా పథకం కింద ఇచ్చిన మొత్తంతో సమానమని, ప్రస్తుతం దేశంలో 70 కోట్ల మంది దగ్గర ఎంత డబ్పు ఉందో అంతే సమానమైన డబ్బు కేవలం 22 మంది బిలియనీర్ల చేతుల్లో ఉందని రాహుల్ తెలిపారు. బీజేపీ నేతలు తాము రిజర్వేఫన్లకు వ్యతిరేకం కాదని అంటున్నారని, ఒకవేళ అదే నిజమైతే వారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు దళితులకు, ఆదివాసీలకు, బలహీనవర్గాలకు ఏదైనా ప్రయోజనం చేకూరిందంటే అది రాజ్యాంగం ద్వారానేనని, అందుకే రాజ్యాంగాన్ని విసిరి పారేయాలని బీజేపీ చూస్తున్నదని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదని, రెండు సిద్ధాంతాల మధ్యజరుగుతున్న యుద్ధమని రాహుల్ అభివర్ణించారు. ఒకవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యాంగాన్ని సంరక్షించి తద్వారా కోట్లాది మంది దళితులకు, ఆదివాసీలకు, బలహీనవర్గాల హక్కులను కాపాడేందుకు పాటు పడుతుంటే, మరోవైపు బీజేపీ నతృత్వంలోని ఎన్డిఏ కూటమి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి, కేవలం కొంత మంది బడా కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే దిశగా ఆలోచిస్తున్నదని, అందుకే ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా రాహుల్ అభివర్ణించారు.




