- సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది
- మోదీ మాటలతో ఆ బంధం నిజమని స్పష్టమైంది
- ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన
- ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. వొచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. బీఆరెస్ 7 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేసే వీలుగా సీట్ల పంపకం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ…బీఆరెస్ బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని వ్యాఖ్యానించారు. బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని తమ నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు పక్రియను మోదీ అపహాస్యం చేశారన్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆరెస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆరెస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి కాబట్టే మోదీ చర్యలు తీసుకోవడం లేదని, కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆరెస్‌కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే…అవిభక్త కవలలు మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం…వారిది గల్లీలో కుస్తీ, దిల్లీలో దోస్తీ…అని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇసారని ప్రశ్నించారు.
ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది.. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆరెస్ తోనా? బీజేపీ, బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా స్పష్టం చేయలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌కు నీళ్లు అంటే..కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి , నిధులు అంటే దోపిడీ సొమ్ము…నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు..ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే..మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంతని ప్రశ్నిస్తూ…బీఆరెస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వొచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని, మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
హారీష్ రావుకు కౌంటర్
ప్రజల దృష్టిని మరల్చడానికే తనపై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళు జైలుకెళ్లే టైమ్ వొచ్చిందనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. కొడంగల్‌లో పదేళ్లు తాను చేసిన అభివృద్ధి..ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని రేవంత్ సవాలు విసిరారు. కోస్గి, కొడంగల్, మద్దూరులో హాస్పిటళ్లు తీసుకొస్తే వాటిని వాళ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బస్ డిపో కోసం 5 ఎకరాలు తాము కొని ఇచ్చామని, బిల్లా రంగాలు ఇద్దరూ కొడంగల్ రావాలని, కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
ప్రజల దృష్టిని మరల్చడానికే తనపై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళు జైలుకెళ్లే టైమ్ వొచ్చిందనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. కొడంగల్‌లో పదేళ్లు తాను చేసిన అభివృద్ధి..ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని రేవంత్ సవాలు విసిరారు. కోస్గి, కొడంగల్, మద్దూరులో హాస్పిటళ్లు తీసుకొస్తే వాటిని వాళ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బస్ డిపో కోసం 5 ఎకరాలు తాము కొని ఇచ్చామని, బిల్లా రంగాలు ఇద్దరూ కొడంగల్ రావాలని, కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.





