బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
జహీరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 28:బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో   అవినీతి ఆకాశాన్నంటిoదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.  మంగళవారం జహీరాబాద్ లో జరిగిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడుతూ  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందనీ అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతిమాయమైందని,రెండు సార్లు అధికారo ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా లేస్తుందని..ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నా పత్రాలు లీక్ అవుతాయని.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అలాగే కొనసాగుతాయని మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని, యువత ఆశలపై కేసీఆర్ సర్కారు నీళ్లు చల్లిందని అన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని.. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగులు రాలేదు. ఉపాధిలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ ప్రాంతంలో చాలా అవినీతి జరిగిందన్నారు. లంబాడీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ ప్రజల పక్షాన ఉన్నారన్నారు. తెలంగాణ బిడ్డలు బాగుండాలని కోరుకున్నారని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.
గులాబీ పార్టీ నేతలు విలాసవంతమైన భవంతుల్లో నివసిస్తున్నారని, కానీ పేదలు మరింత పేదరికంలోకి వెళ్లారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడుందన్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ మాదిరిగానే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అన్నదమ్మలు గా పనిచేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు చిన్నతమ్ముడిగా ఎంఐఎం పార్టీ ఉందన్నారు. నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్ర శేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, పార్టీ  మండల నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *