సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ పేరిట నోటీసులు ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పార్టీ శ్రేణులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో కేసులు కావడం పరిపాటని ఆ కేసులను సాకుగా చూపి ఎన్నికలఘ సమయంలో బైండోవర్ నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కు రావాలని పిలవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.బైండోవర్ కావాలని బిజెపి నాయకులను కార్యకర్తలు బెదిరించడం పోలీసులు మానుకోవాలన్నారు.పార్టీ పిలుపు ఇచ్చినప్పుడు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడతామని ఆ కార్యక్రమాలు నిర్వహించిన టైంలో పెట్టిన కేసులు తిరిగి ఎత్తడం సరైన చర్య కాదని అన్నారు.ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడుతాయని అన్నారు.రౌడీలను,గుండాలను, నేరాలు చేసినటువంటి వాళ్లను ఏ విధంగా అయితే బైండోవర్ చేస్తారో ఆ విధంగా పార్టీ కార్యకర్తలను బైండోవర్ చేయడం హాస్యాస్పదమన్నారు.దీని మీద పోలీసు యంత్రాంగం పునరాలోచన చేయాలని కార్యకర్తలకు ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు.బిజెపి కార్యకర్తలు బైండోవర్ నోటీసులు తీసుకోరని తేల్చి చెప్పారు.సిద్దిపేటలో బిజెపి నాయకులపై కావాలని కుట్రపూరితంగా నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ఎన్నికల అధికారి జోక్యం చేసుకొని బైండోవర్ నోటీసులు ఆపాలని విజ్ఞప్తి చేసినట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్ భోగి శ్రీనివాస్, సాయికిరణ్, కమ్మ శ్రీనివాస్ వేణు పాల్గొన్నారు.
బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు



