ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. శుక్రవారం కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీదవారికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతులు పండించిన కింటాలు వడ్లకు రూ.3100 మద్దతు ధర అందిస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి వీసాలు ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలని నిలవరిస్తామన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డలకు ఫిక్స్ డిపాజిట్ చేసి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు అమ్మాయి ఖాతాలో వేయడం జరుగుతుందని తెలిపారు. అప్ కీ బార్ డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఉద్యమాల ముద్దుబిడ్డగా పేరుందిన ఆచారిని ముస్లిం మైనార్టీలు మద్దతు తెలిపి గెలిపించుకోవాలన్నారు. ఆచారి కులమతాలకతీతంగా పనిచేసే నాయకుడని అలాంటి నాయకుడు దొరకడం కల్వకుర్తి ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు హిదాయత్ అలీ, అలీ గౌతమి, సమీ ఖాన్, సాదిక్ బాయ్, గజినీ పాషా, జునైద్ హుస్సేన్ తదితరు పాల్గొన్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం




