ఇకపోతే నాయకుల మధ్య సయోధ్యకు ఆ పార్టీ పడుతున్న పాట్లు ఏంటన్నది హర్యాన గవర్నర్ దత్తాత్రేయతో ఈటల, జితేందర్‌రెడ్డి మంతనాలు. కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ సైనికుడైన దత్తాత్రేయ గవర్నర్ హోదాలో ఉండి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరకు వెళ్ళి వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేయాల్సి రావడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణ ఏమైంది అన్న చర్చ జరుగుతుందిప్పుడు. ఇతర పార్టీలో సభ్యులుగా అవినీతికి పాల్పడ్డ కొందరు నాయకులను తమ పార్టీలో ఆశ్రయమిస్తున్న బీజేపీని రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు అభ్యంతరం తెలపడం లేదు ..అధికారం కోసం విలువలకు, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందా అన్న అనుమానం రాక మానదు.
మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర
భారతీయ జనతాపార్టీ ఎంత స్వతంత్రంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నా దాని రిమోటు కంట్రోల్ అంతా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చేతిలో ఉందన్న విషయాన్ని రాజకీయాల్లో ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్నవారైనా చెబుతారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి విజయానికి ఆర్‌ఎస్‌ఎస్ తెరవెనుక కృషి ఉంటుందన్నది సాధారణ రాజకీయాలు తెలిసినవారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలు మొదలు రాజకీయ నిర్ణయాల విషయంలో మొదటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌కు స్థిరమైన అభిప్రాయాలుంటాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ను బిజెపి మాతృసంస్థగా భావిస్తారు. హిందూ జాతీయ వాద సంస్థగా దానికి పేరుంది. భారతీయ హిందూ సమాజాన్ని ఒక హిందూ దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పడింది. భారతీయ సంస్కృతి, పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహించాలన్నదే దాని దృక్పథం. అన్నిటికీ ముఖ్యంగా హిందుత్వ భావాజాలాన్ని వ్యాప్తిచేయడం దాని ప్రధాన ధ్యేయం. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్ సూచనలను, సలహాలను ఇటీవల బిజెపి నాయకత్వం పట్టించుకోవడంలేదా అన్న అనుమానానికి తావేర్పడుతోంది.
ఆర్‌ఎస్‌ఎస్ పరిధిలో ఉన్న పలు శాఖలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. విహెచ్‌పి, శ్రీరామసేన, రాష్ట్రీయ సేవికాసమితి, భజరంగ్‌దళ్, ఏబివిపి, భారతీయ మజ్ధూర్ సంఘ్, స్వదేశీ జాగరణమంచ్, భారతీయ కిసాన్ సంఘ్, దుర్గావాహినీ ఇలా అనేక సంస్థలన్నీ సంఘ్ పరివార్ సూచనలమేరకు కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. సమాజం ఎదురుకుంటున్న సమస్యలపై ఆయా ఆర్గనైజేషన్‌ద్వారా సమాచారాన్ని సేకరించుకుని రాజకీయ పార్టీ అయిన బిజెపికి తగిన రాజకీయ సలహాలను ఆర్‌ఎస్‌ఎస్ అందిస్తుంటుంది. అలాంటి సంస్థకు తమ సలహాలను, సూచనలను బిజెపి నాయకత్వం పట్టించుకోవడంలేదన్న అభిప్రాయం కలిగినట్లుంది. ఇంతకాలంగా ఏనాడు బిజెపి రాజకీయాల్లో బహిరంగంగా పట్టించుకున్నట్లు కనిపించని సంఘ్ పరివార్ తన సొంత పత్రిక ఆర్గనైజర్ వేదికగా బిజెపికి చురకలు అంటించింది. ఒక విధంగా చివాట్లు పెట్టినంత పనిచేసిందని కూడా చెప్పవొచ్చు.
కొంతకాలంగా బిజెపి దేశ వ్యాప్తంగా దూసుకుపోతున్న విషయం తెలియందికాదు. అయితే ఉత్తరభారత్‌లోని హిందీ రాష్ట్రాల్లో వొచ్చిన ఊపు దక్షిణ ప్రాంతంలో ఆ పార్టీ రాణించలేకపోతోంది. తాజాగా కర్ణాటక ఓటమి ఆ పార్టీని నైతికంగా కృంగదీసింది. కర్ణాటక ఓటమికి కొన్ని స్వయంకృ తాపరాధాలు ఆ పార్టీ మూటకట్టుకోవడమేనుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అనుభవమున్న నరేంద్రమోదీని ప్రధానిగా ఎన్నుకున్నప్ప టినుండి ఆ పార్టీ పురోగమిస్తూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురైన అనేక సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటూ వొస్తున్నపేరు నరేంద్రమోదీకి వొచ్చింది. విదేశాల్లో కూడా మోదీ మీద, తద్వారా భారత దేశంపైన ఓ నమ్మకాన్ని బిజెపి ప్రభుత్వం కలిగించకలిగింది. అయితే కేవలం మోదీ చరిష్మా ఎల్లవేళలా పనిచేయదన్నది ఆర్‌ఎస్‌ఎస్ అంటున్నమాట. ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో ప్రపుల్లా కేట్కర్ రాసిన సంపాదకీయం అదేవిషయాన్ని చెప్పింది. బిజెపి కేవలం మోదీ చరిష్మాను, హిందుత్వ వాదాన్ని నమ్ముకోవడంద్వారా ఎల్లకాలం విజయాన్ని సాధించలేదన్నది దానిలోని ప్రధాన సూచన. ముఖ్యంగా కర్ణాటక ఓటమిని దృష్టిలో పెట్టుకునే ఈ సంపాదకీయం రాసినట్లుగా కనిపిస్తున్నది.
స్థానిక సమస్యలను, స్థానిక నాయకత్వంపై దృష్టిపెట్టకుండా కేవలం మోదీ చరిష్మా, హిందుత్వం పైన అధారపడడంవల్లే కర్ణాటక•లో బిజెపి వ్యతిరేక ఫలితాలను చూడాల్సి వొచ్చిందన్న భావన అందులో ఉంది. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రద్వారా సామాన్య ప్రజలకు సన్నిహితంకాగా, స్థానిక సమస్యలనే తన ప్రచార ఆయుధాలుగా కాంగ్రెస్ సంధించింది.. అంతేగాక స్థానిక నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన దృష్టి పెట్టడంవల్లే విజయం సాధించిందన్న విషయాన్ని ఆ సంపాదకీయం చెప్పకనే చెప్పింది. అందుకే బిజెపి ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉందంటూ సూచనేకాదు, ఒక విధంగా ఆ పార్టీకి వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. ఇవ్వాళ కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎంలకు మధ్య వర్గ విభేదాలున్నా ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ శ్రమించింది. బిజెపిలో మాజీ సిఎం యడ్యూరప్పను మార్చడంవల్ల అక్కడ ఏర్పడిన ఖాలీని పూరించలేకపోవడమే ఓటమికి కారణంగా మారిందన్న సంఘ్ అభిప్రాయం అందులో కనిపిస్తున్నది.
త్వరలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. ఛత్తీస్‌ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాంతోపాటు తెలంగాణరాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరునున్నాయి. కనీసం ఈ ఎన్నికల్లోనైనా కర్ణాటక•లో జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని సూచిస్తోంది సంఘ్ పరివార్. వాస్తవంగా మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో అవినీతిపై కొరడ జుళిపించాడన్న పేరు అయనకొచ్చింది. ప్రధానిపైన అవినీతి ఆరోపణలన్నవి ఇంతవరకు రాలేదు. కాని, బిజెపి పాలనలో కర్ణాటక అవినీతిలో కూరుకుపోయిందన్నది ప్రబలంగా ప్రజల్లో ఉండిపోయింది.కర్ణాటక ఓటమికి అది ఒక పెద్ద కారణంగా మారింది. ఇది 40 శాతం కమీషన్ ప్రభుత్వమన్న పేరు పడింది. దానికి తగినట్లుగా కుటుంబ పాలన తదితర అంశాలు బిజెపి ఓటమికి దోహదపడ్డాయి. రేపు అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్న సూచన చేసిందా సంపాదకీయం. ఇలాంటి సూచనను సంఘ్ బహిరంగంగా చేయడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఎప్పుడూ అంతర్ఘతంగా సూచనలు చేసే సంఘ్ తన పత్రికలో ప్రకటించిడమంటే బిజెపి నాయకత్వం సంఘ్‌పరివార్ మాటలను చెవికెక్కించు కోవడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కర్ణాటక• ఫలితాలు రావొద్దనే ఈ సంపాదకీయం ద్వారా ముందస్తుగా హెచ్చరించినట్లు స్పష్టమవుతున్నది.
వాస్తవగా బిజెపికి క్రమశిక్షణగల పార్టీగా పేరుంది. కొన్ని దశాబ్ధాల తర్వాత ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వొచ్చినా పార్టీ నాయకుల మధ్య మనస్పర్థలుగాని, ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకునే విధానం ఆ పార్టీలో చాలా అరుదు. వారి మధ్యఉన్న కీచులాటలు ఎక్కడ బయట పడేవికావు. కాని, ఇటీవల తెలంగాణలో ఆ పార్టీ కడుదీనమైన పరిస్థితిని ఎదురుకుంటోంది. నాయకులు బహిరంగంగానే విమర్శించుకోవడం, పార్టీ వీడిపోతున్న సంకేతాలనివ్వడం చూస్తుంటే నాయకులపైన పార్టీ పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఆరోపించడం, కేంద్ర నాయకత్వానికి ఆయనపైన ఫిర్యాదులు చేయడం సహజమైపోయింది. బండి సంజయ్ నాయకత్వంలో తాము పనిచేయలేమని బాహాటంగానే చెబుతున్నారు. నాయకత్వ మార్పు అనివార్యమంటు ఇతర పార్టీల నుండి వలస వొచ్చిన నాయకు బెదిరింపులకు దిగి రావలసిన దుస్థితి బీజేపీ కి ఏర్పడింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షా పదవి మార్పు అనివార్యమయింది .. దీనిపైన గతంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానమే బిజెపికూడా చేపట్టింది.
అసంతృప్తులను దిల్లీకి పిలిచి అనునయించడం లాంటి చర్యలను చేపట్టింది.. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం నాయకత్వమార్పే అన్న నిర్ణయానికి వొచ్చి బండి సంజయ్ ను మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. చైర్మన్ గా ఉన్న మరో అసంతృప నేత ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణా కమిటీ బాధ్యతలను అప్పగించింది. . అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండి సంజయ్‌ను మార్చితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. మొదటినుండి సన్నిహిత సంబంధాలుండడంతో బండి సంజయ్‌కు సంఘ్ మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బిజెపి ఇక్కడ పెద్దగా పుంజుకున్నదిలేదు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రేటర్‌లోగాని, ఆ తర్వాత ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో బిజెపి దూకుడు కనిపిస్తున్నది. బిఆర్‌ఎస్‌కు బిజెపియే ప్రత్యమ్నాయమన్న మాట వినిపిస్తున్నది. ఈ తరుణంలో బండి సంజయ్ మార్చడం పార్టీకి నష్టంచేయడమేనన్నది ఆర్‌ఎస్‌ఎస్ బిజెపికి సూచించినట్లు కనిపిస్తున్నది.
ఆయన మీద వొచ్చిన ఫిర్యాదు రిపోర్టులన్నీ తప్పుల తడుకలేనన్న వాస్తవాన్ని ఆర్‌ఎస్‌ఎస్ బిజెపికి చెప్పినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్ష స్థానంకోసం పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దుబ్బాక ఎంఎల్‌ఏ రఘునందన్‌రావు నేను ఆ పదవికి అర్హుడిని కాదా అంటూనే, అధిష్టానం చెప్పినట్లే వింటానంటున్నాడు. ఇకపోతే నాయకుల మధ్య సయోధ్యకు ఆ పార్టీ పడుతున్న పాట్లు ఏంటన్నది హర్యాన గవర్నర్ దత్తాత్రేయతో ఈటల, జితేందర్‌రెడ్డి మంతనాలు. కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ సైనికుడైన దత్తాత్రేయ గవర్నర్ హోదాలో ఉండి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరకు వెళ్ళి వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేయాల్సి రావడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణ ఏమైంది అన్న చర్చ జరుగుతుందిప్పుడు. ఇతర పార్టీలో సభ్యులుగా అవినీతికి పాల్పడ్డ నాయకులను తమ పార్టీలో ఆశ్రయమిస్తున్న బీజేపీని రిమోట్ కంట్రోల్ చేతులో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు అభ్యంతరం తెలపడం లేదు..అధికారం కోసం విలువలకు, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందా అన్న అనుమానం రాక మానదు.
ఈ విషయాలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ నెల11న బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులతో దిల్లీ నాయకత్వం సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఆర్‌ఎస్‌ఎస్ సూచనమేరకు స్థానిక నాయకత్వం, స్థానిక సమస్యలపై ఎలా దృష్టి పెట్టాలి, బిఆర్‌ఎస్‌ను ఢీ• కొట్టాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటన్న విషయాలపై ఈ సమావేశంలో కూలంకశంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది.




