బిఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఫోన్ల ట్యాపింగ్‌

  • మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో వ్యవహారం
  • అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వొచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగ రావు కీలక విషయాలు వెల్లడిరచారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌ చేశామని, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్‌ చేశామని, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్‌ చేశామని, బీఆర్‌ఎస్‌లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశామని, ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని, విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల  ఫోన్లు ట్యాప్‌ చేశామని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

ఇక విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాక్‌ చేశామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్‌ చేశామని, మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్‌ చేశామని, మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్‌ చేశామని, మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్‌ చేపట్టామని, మళ్లీ బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తన వాజ్ఞూలంలో భుజంగ రావు పేర్కొన్నట్లు సమాచారం.

నేతల సూచనలతో పలు సెటిల్‌మెంట్లు చేశామని, కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలు సెటిల్‌ చేశామని, రెండు ప్రైవేట్‌ హాస్పిటళ్ల నుంచి భారీగా డబ్బు తరలించామని, బీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లామని, రియల్టర్‌ సంధ్యా శ్రీధర్‌రావు ఎలక్టోరల్‌ బ్యాండ్లు కొనేలా చేశామని, మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించామని వెల్లడిరచినట్లు తెలుస్తున్నది. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వెంకటరమణారెడ్డి, రేవంత్‌ సోదరుడు కొండల్‌ రెడ్డిపై నిఘా పెట్టామని, పేపర్‌ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించిన వారి ఫోన్లు ట్యాప్‌ చేశామని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *