ఉగాది పచ్చడిలా పరిస్థితులు
రేవంత్ రెడ్డి సిఎం పదవి కేసీఆర్ భిక్షే
రెండు నెలల్లోనే ప్రభుత్వం 14 వేల కోట్లు అప్పు
మాయమాటలు చెప్పి అధికారంలోకి..హామీలు ఏమయ్యాయి…?
మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ
స్వామివారిని దర్శించుకున్న హరీష్ రావు
భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : పార్టీలో పనిచేసేటప్పుడు గెలుపు ఓటమిలు సహజమేనని…బిఆర్ఎస్ పార్టీలో కూడ ముళ్ళ బాటలు, పూల బాటలు ఉంటాయని కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసినప్పుడే మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటామని మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేసారు. శనివారం నాడు భద్రాచలం కెకె ఫంక్షన్ హాలులో మండల అధ్యక్షులు అరికకెళ్ళ తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఉగాది పచ్చడిలా తీపి, చేదు కలగలకలిసినట్టు ఉన్నదని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో శాసన సభ స్థానం గెలుపొందామని కానీ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో తీపి, చేదు కలిసినప్పుడే సమానంగా ఉంటామని అదే విధంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మాయమాటలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో మోసం చేసిందని విమర్శించారు.
ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు రైతు బంధు కానీ వృద్దాప్య, వితంతు, మహిళలకు 2,500 పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 పథకాలు 420 మాటలు లాగే ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పోరాటం వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని, దీనివలనే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు అయ్యారని, ఆ తరువాత ముఖ్యమంత్రి పదవి కూడ దక్కిందని అన్నారు. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే రేవంత్ రెడ్డికి ఈ పదవులు దక్కాయని అన్నారు. రేవంత్ రెడ్డికి సియం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని పట్టించుకునే నాథుడే ఉండేవాడని కాదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు చేసిందని గ్లోబల్ ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చారని విమర్శించారు. తాము దూరం పెట్టిన ఆదానీని అలైబలై చేస్తున్నది రేవంత్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే బిజెపి అభ్యర్థులను ఓడిరచి తాము గెలిచామని ఎక్కడా కూడ కాంగ్రెస్ బిజెపిని ఓడిరచలేదని అన్నారు. మొదటి నుండి బిజెపి పార్టీతో కాంగ్రెస్ సఖ్యంగానే ఉందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 3.87 లక్షల కోట్లు అప్పు చేస్తే 7 లక్షల కోట్లని రaూటా మాటలు చెప్తున్నారని విమర్శించారు.
రెండు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం 14 వేల కోట్లు అప్పు చేసారని, దీనికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వొచ్చినట్లు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలదేని చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆదిలబాద్ జిల్లాలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసామని, తండాలను పంచాయితీలుగా తీర్చిదిద్దామని, ఎన్నో ఏళ్ళు కలగా మిగిలిన మంచిర్యాలను జిల్లాగా తీర్చిదిద్దామని గుర్తు చేసారు. మారుమూల ప్రాంతాలకు సైతం మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని ఇటువంటి పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనబడటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపిస్తామని చెప్పటం హాస్యస్పదంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ తల్లకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని ఎద్దేవా చేసారు. నితీష్, మమత, కేజ్రివాల్ ఇప్పటికే ఇండియా కూటమి నుండి తప్పుకున్నారని అన్నారు. తాము గెలిచిన వెంటనే 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదని, కనీసం తాము ఇచ్చే 2 వేలు కూడ ఇవ్వలేకపోయారని విమర్శించారు.
మార్పు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వొచ్చిన నాటి నుండే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసారని విమర్శించారు. భద్రాచలంకు ఉన్న ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపింది బిజెపి ప్రభుత్వమైతే..దానికి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. దీని కారణంగా భద్రాచలంకు వొచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి తీరాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బిఆర్ఎస్ తరఫున తెలంగాణ సమస్యలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. భద్రాచలం శాసన సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ తాత మధును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు డా.తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవీచంద్ర, మానె రామకృష్ణ, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నెం సత్యాలు , ఇల్లందు మాజీ శాసన సభ్యులు హరిప్రియ, గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, వాజేడు, వెంకటాపురం మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
భద్రాచలం విచ్చేసిన మాజీ మంత్రి , సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంకు వొచ్చిన ఆయనను ఆలయంలోకి స్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకకున్నారు. అనంతరం లక్ష్మీతాయారమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఆవు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు ఉన్నారు.



