టిఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారినప్పటి నుండీ దేశంలోని భిన్న ప్రాంతాల నుండి అనేక మంది ఆ పార్టీలో చేరడానికి ఆతసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి స్వయంగా విచ్చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నవారు కొందరైతే, తమ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా కోరుతున్నవారు మరికొందరు. దీంతో బిఆర్‌ఎస్ జాతీయ స్థాయిలో విస్తృతిస్తుందనుకుంటే స్వరాష్ట్రంలోనే దానికి ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. పార్టీకి ఆయువు పట్టు అయిన గ్రామాల నుండే వ్యతిరేకత మొదలవుతుండడం నిజంగా ఆరంభంలోనే అవరోధంగా మారుతున్నది. దేశం కోసం ప్రాణాలొడ్డిన జవాన్‌ల కుటుంబాలను, వివిధ ప్రాంతాల్లో అసువులు బాసిన రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే తెలంగాణ సర్కార్ స్వంత రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఆర్థిక ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కేవలం ఆరోపణలేకాదు, ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామాస్త్రాలను సంధిస్తున్నారు. కుమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సర్పంచ్‌లు మూకుమ్మడిగా తమ సర్పంచ్ పదవులతోపాటు పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జాతీయ స్థాయికి ఎదుగాలనుకుంటున్న బిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన విషయం. స్వరాష్ట్రంలో అందులో స్వంత పార్టీకి చెందిన వారిలోనే ఐక్యతను సాధించలేకపోయినప్పుడు, దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన పార్టీలన్నిటినీ బిజెపికి వ్యతిరేకంగా ఏవిధంగా సంఘటితం చేస్తుందన్న విమర్శ బిఆర్‌ఎస్‌పైన ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అనేక రంగాల్లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతిని సాధిస్తున్నదని చెబుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదనడానికి ఈ ఆదివాసీ సర్పంచ్‌ల ఆవేదన అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. గడచిన తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన నిధులు రాకపోవడంతో ఆర్థికంగా వారు పడుతున్న బాధలు ఇంతా అంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్దెనిమిది మంది గ్రామ సర్పంచ్‌లు తామిక ఈ బాధలు పడలేమంటూ ఏకంగా తమ పదవులతోపాటు, పార్టీకి కూడా రాజీనామా చేయడం నిజంగా రాష్ట్రంలో ఈ అంశం సంచలనాత్మకమైంది. వాస్తవంగా వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గినవారే. ఏ పార్టీతో సంబంధం లేకుండా సర్పంచ్‌లైన వీరు, తమ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ సహాకారం అవసరం కాబట్టి, అధికారపార్టీలో చేరితే మరిన్నినిధులు వొస్తాయనుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీఏట గ్రామాలకు కేటాయించే నిధులను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా నిధులు లేకపోయినప్పటికీ అప్పుచేసి, పనులు చేపట్టారు. కాని, రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా నిధులు కేటాయించకపోవడంతో అప్పుల బాధను తట్టుకోలేకనే, తామీ నిర్ణయానికి వొచ్చినట్లు ఆదివాసీ సర్పంచ్‌లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఇది కేవలం ఆదివాసీ సర్పంచ్‌ల గోడేకాదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామపంచాయితీల పరిస్థితి ఇదే విధంగా ఉంది. దీంతో ఒక్కొక్కరుగా అందరూ తమ ఆవేధనను వ్యక్తం చేస్తూ బయటపడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన గ్రామ సర్పంచ్‌లు చేపట్టిన ఆందోళన అయితేనేమీ, నల్లబెల్లి ప్రాంతానికి చెందిన వారైతేనేమీ ఎవరు ఆందోళన చేపట్టినా నిధుల కేటాయింపులో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ఏకరువు పెడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కింద రాష్ట్రంలోని 12 వేల 751 గ్రామాలకు సుమారు 250 కోట్ల రూపాయలను ప్రతీ నెల కేటాయిస్తుంది. కాని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో కూడా సక్రమంగా నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామాలు ఆర్థిక భారాన్ని మోయలేకున్నాయి. రాష్ట్రంలోని సర్పంచ్‌లంతా గోలపెడితే కేవలం నాలుగు నెలల నిధులను మాత్రం ప్రభుత్వం అందించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రతీనెల అందించే వాటా ధనాన్ని నేరుగా గ్రామ పంచాయితీ ఖాతాల్లో జమ అయ్యేట్లుగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం వల్ల వాటిని సకాలంలో తిరిగి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడంలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈ ఏర్పాటు చేసింది. అయినా ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్‌లకు తెలియకుండా అధికారుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులనే తమ నిధులుగా చెప్పి గ్రామపంచాయితీలకు అందజేస్తున్నదన్నది వారి ఆరోపణ. 15వ ఆర్థిక సంస్థద్వారా అందించే నిధులను పంచాయితీల ప్రత్యేక ఖాతాలో బ్యాంకుల్లో జమచేయడం జరుగుతుంది. అందుకు సంబంధించిన డిజిటల్ కీ సంబంధిత అధికారుల వద్ద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహకారంతో ఆయా ఖాతాల్లోని డబ్బంతా ఖాళీచేయించింది. దీంతో పంచాయితీల్లో పైసా లేకుండా పోయింది. కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ ఇఎంఐలు కట్టడంతోపాటు చేయించిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు పైసా లేదని వారు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం నిధులు దారిమళ్ళిన విషయం తెలుసుకోలేని సర్పంచ్ మాకొద్దు, వెంటనే రాజీనామా చేయాలని రాజన్న సిరిసిల్లజిల్లా బోయినపల్లి మండలం, వెంట్రావుపల్లి గ్రామస్తులు తాజాగా ఆందోళన చేపట్టడం కూడా ఈ విషయన్నే ఎత్తిచూపుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో సర్పంచ్‌ల ఆందోళన, రాజీనామాల పరంపర మరికొంత కాలం కొనసాగినా ఆశ్చర్యపడాల్సింది లేదు.




