భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఏర్పాటుతో తెలంగాణ సెంటిమెంట్‌కు తెరపడనుందా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది. అవునన్నా, కాదన్నా గత రెండు దశాబ్ధాలకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) రాజకీయ ఎదుగుదలకు తెలంగాణ సెంటిమెంట్ ప్రధాన కారణం అన్నది వాస్తవం. టిఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు దాదాపు మూడు దశాబ్ధాలకింద అ సెంటిమెంట్‌తోనే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో అంతే స్పీడ్‌తో చల్లారిపోయింది. కాని 2001లో కెసిఆర్ అదే సెంటిమెంట్‌ను రగిల్చి లక్ష్యాన్ని ముద్దాడారు. టిఆర్ఎస్ అధినేతగా ఆ సెంటిమెంట్‌తోనే రాజకీయంచేశారు. తెలంగాణ మాటనే వినడానికి ఇష్టపడని రాజకీయ పార్టీలను కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మరల్చకలిగారంటే ఇక్కడి ప్రజల్లో ఆ సెంటిమెంటు ఎంత బలంగా వేళ్ళూనుకుని ఉందన్నది స్పష్టమవుతున్నది. వాస్తవంగా ఒక సంవత్సరకాలం ఆలస్యంగా ఈ గడ్డకు స్వాతంత్య్రం లభించినప్పటికీ, ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగనివ్వకుండా చేసిన కుట్రలు, ఆ తర్వాత క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా కాలరాసారనడానికి చరిత్రే సాక్ష్యం. అప్పటినుండీ ఏ రంగంలో చూసినా ప్రాంతేతరులదే పెత్తనంగా కొనసాగుతూ వొచ్చింది. దానికి 2014లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు.
సబండవర్ణాలు కలిసి కట్టుకగా దశాబ్ద కాలంగా పైగా చేసిన పోరాటాలే అందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆట, పాటతో భావాజాల వ్యాప్తి, వెలకట్టలేని ప్రాణత్యాగాలు, చిన్నపెద్ద తారతమ్యంలేక, ఆడ మగ అన్న భేదం లేకుండా యావత్ తెలంగాణ ప్రజలు మన నీళ్ళు, నిధులు, నియామకాలన్న నినాదంతో కఠోర పరీక్షలను దాటుకుని సఫలమైనారు. ఒక విధంగా డెబ్బై ఏళ్ళ కిందటి స్వాతంత్య్రాన్ని తెలంగాణ ప్రజలు ఏడేళ్ళ కింద పొందినట్లు అయింది. ఇంతకాలం దూరమైన హక్కులను అధికారికంగా ఇప్పుడిప్పుడే పొందుతున్నామను కుంటున్నారు తెలంగాణ ప్రజలు. కాని, అది మూడునాళ్ళ ముచ్చట అవనుందా అన్న భయం ఇప్పుడు పట్టుకుంది. ఇంతకాలంగా తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉందనుకున్న టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్గా మారడమే ఈ భయానికి కారణమైంది. పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నట్లు తెలంగాణ సెంటిమెంట్‌ను టిఆర్ఎస్ దీనితో వొదిలేసినట్లేనంటున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, భారతీయ జనతాపార్టీలు ఇంతకాలం తెలంగాణేతర రాజకీయ నాయకులను ఇక్కడ నిలబెట్టడానికి సాహసించలేదు. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర పార్టీలుకూడా ఇక్కడ తమ పార్టీలను విస్తృతించడానికి వెనకాడుతూ వొచ్చాయి.
ఎప్పుడైతే ఉద్యమకారులను టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దూరంపెడుతూ వొచ్చారో ఇక్కడ రాజకీయ వ్యాక్యూమ్ ఏర్పడిందంటూ, దాన్ని తమ అవకాశంగా మలుచుకోవాలని ఒక్కో పార్టీ రాజ్యంగ ముసుగులో తిరిగి తెలంగాణ బాట పడుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడాన్ని మొదటి నుండీ పూర్తిగా వ్యతిరేకించిన వారంతా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ స్థానిక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలని ఆనాడు తెలంగాణలో తిరిగిన వైఎస్ షర్మిల ఇవ్వాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో యావత్ తెలంగాణను చుట్టబెడుతోంది. తాను తెలంగాణ కోడలని చెప్పుకుంటోంది. వొచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు దాదాపు ఏడాదికాలంగా తన పార్టీని సిద్ధం చేస్తున్నది. పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణలో పోటీ చేయడానికే వెనుకాడిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పత్తాలేకుండా పోయిన తెలుగుదేశం మరోసారి తెలంగాణలో తమ పార్టీని పటిష్టపర్చే సన్నాహాలు చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా ఖమ్మం, రాష్ట్ర రాజధాని నగరాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా మీకు మేమున్నామన్న భరోసా వారికి మరోసారి కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ మూడు పార్టీలు కూడా కేంద్రంలోని బిజెపి కనుసన్నల్లో నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్నది. అలాగే మరో పార్టీ ప్రజాశాంతి పేరున కిలారి ఆనంద్‌పాల్ (కెఏ పాల్) ఇటీవలనే అరంగెట్రం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఏనాడు కనిపించని వీరంతా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీచేయవొచ్చంటూ ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మారుస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకోవడమేకాదు, డిసెంబర్ 9న పార్టీ ఏర్పాటుకూడా జరిగిపోయింది. జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకే బిఆర్ఎస్ ఏర్పాటుగా కెసిఆర్ చెబుతున్నారు. కాని, ఇది ఒక విధంగా నేల విడిచి సాము చేస్తున్నట్లున్నదన్నది తెలంగాణ ప్రజల అభిప్రాయం.
సెంటిమెంట్‌తో సాధించుకున్న తెలంగాణ ఇంకా పూర్తిగా కుదుట పడకుండానే అర్దాంతరంగా వొదిలివేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాంతేతర పార్టీలు ఇక్కడ తిరిగి రంగప్రవేశం చేస్తుంటే అంతో ఇంతో తెలంగాణ వాదానికి కవచంగా ఉంటుందనుకున్న పార్టీ జాతీయ హోదా పేరున స్వీయ పార్టీకూడా ఇతరులకు తలుపులు తెరవడమేంటన్న ప్రశ్నలుత్పన్న మవుతున్నాయి. ఆంధ్రలో బిఆర్ఎస్ విస్తృతికి కృషి జరుగుతున్నప్పుడు, తెలంగాణలోకూడా పాదుకునేందుకు ఇతర ఆంధ్రపార్టీలకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్‌తో ఉద్భవించిన తెలంగాణ జనసమితి లాంటి పార్టీల బాధ్యత మరింత పెరగనున్నది.




