బిజెపిలో చేరిన జహీరాబాద్ ఎంపి పాటిల్
రానునన రోజులోల మరిన్ని చేరికలన్న బీజేపీ ఎంపి లక్ష్మణ్
న్యూ దిల్లీ, మార్చి 1 : పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేశారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపి రాములు బిజెపిలో చేరారు. తాజాగా మరో ఎంపి చేరారు. దిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఎంపీ బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. ఆయన బీజేపీలో చేరడంతో సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు పాటిల్ ఎంపీగా గెలుపొందారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ హై కమాండ్‌పై బీబీపాటిల్ అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ తీరుపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
కాషాయ పార్టీలో చేరితేనే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని భావించిన బీబీపాటిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. బీబీ పాటిల్ బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ స్పందిస్తూ.. బీబీ పాటిల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని లక్ష్మణ్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మోడల్ నచ్చి నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి రోజుకో వికెట్ కోల్పోతుందని చెప్పారు. ఆ పార్టీ రెక్కలు తెగిన పక్షిలా తయారైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బయటకు కత్తులు దుస్తున్నట్లు నటిస్తూ బీజేపీ బలోపేతన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీ బలోపేతన్ని అడ్డుకోలేవని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.





