- తక్షణం అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి
- పరిష్కారానికి తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి
- సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ
- బిజెపి కార్యవర్గ ఏర్పాట్లు పరిశీలించిన బండి
హైదరాబాద్/నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. విద్యార్థులవి సిల్లీ సమస్యలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షమాపణలు చెప్పాలనిన డిమాండ్ చేశారు. విద్యార్థుల 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. 6 రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌కు పట్టదా అని ప్రశ్నించారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై అన్ని విద్యార్థిసంఘాలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమయం ఉండదు కానీ జాతీయ పార్టీ ఏర్పాటుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వారి న్యాయమైన సమస్యలపై సీఎం నియంతలా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలపై సీఎం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జాతీయపార్టీ ఏర్పాటుపై పొలిటికల్ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం కావడానికి సీఎంకు సమయం ఉంటుంది..కానీ గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం కేసీఆర్‌కు టైం దొరకదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విదేశీ పర్యటనకు, కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారు..విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం నిధులు ఉండవా అని ప్రశ్నించారు. మంత్రులు, అధికారులు విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలని హితవు పలికారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సమస్య పరిష్కారమైందని చెప్పడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మంత్రులు, అధికారులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇదిలావుంటే నగరంలోని నోవాటెల్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం పరిశీలించారు. జూలై 2,3,4 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సుమారు 350మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రతినిధుల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.




