- ప్రజెక్ట్ కె షూటింగ్‌లో గాయపడ్డట్లు చిత్రబృందం వెల్లడి
- షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన బిగ్ బి
హైదరాబాద్, మార్చి 6 : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ’ప్రాజెక్ట్ కే’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగి పోయిందని అమితాబ్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. తాను గాయపడటంతో షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ ముంబయికి వెళ్లారు. ప్రస్తుతం ముంబయిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు అమితాబ్ తెలిపారు.
అమితాబ్ స్వయంగా తన బ్లాగ్‌లో వివరాలను తెలిపారు. హైదరాబాద్‌లో ’ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ షాట్ సమయంలో ప్రమాదం జరిగింది. వెంటనే ఎఐజి హాస్పిటల్‌లో డాక్టర్లను సంప్రదించగా.. నాకు సిటి స్కాన్ చేశారు. మిగతావారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. నా గాయం కాస్త నొప్పిగానే ఉంది.. కదలడానికి , ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. నొప్పికి కొన్ని మందులు ఉపయోగిస్తున్నాను. గాయం కారణంగా చేయాల్సిన పనులన్నీ ఆగిపోయాయి. చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులను ఫోన్ ద్వారా అటెండ్ చేస్తున్నాను.
ఈరోజు సాయంత్రం అభిమానులను కలవలేను. అందుకే ఎవరు రావద్దు. అని వెల్లడించారు. అయితే నిర్మాత అశ్వినీదత్ మాత్రం అలాంటిదే లేదన్న ప్రకటన చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పడుకొణెళి జంటగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బ్జడెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటి పెంచగా.. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాంటసీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ లో అమితాబ్ గాయపడినట్లు సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది.
అమితాబ్ కు గాయాలు అయిన సమయంలో ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో నే ఉన్నారని కొన్ని వార్తలు అంటుంటే.. కాదు కాదు.. ఆయన షూటింగ్ స్పాట్ లో లేరని మరికొన్ని వార్తలు సోషల్ డియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ లో అమితాబ్ గాయపడ్డారనే విషయం తెలిసిన వెంటనే.. బిగ్ బీకి ఎలా ఉంది.. ఏమైందీ.. ఎలాంటి గాయాలు అయ్యాయి అని ఆరా తీశారంట.. అమితాబ్ తో ఫోన్ లో మాట్లాడి.. గాయాలపై సానుభూతి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్ గాయపడినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. ప్రభాస్ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్..ట్విట్టర్ వేదికగా.. గెట్ వెల్ సూన్ బిగ్ బీ అంటూ పోస్టులు పెడుతున్నారు.



