ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ తాతయ్యలు పెద్దవాళ్లు కథలతో పాటు అనేక విషయాలు చెప్పేవారు .బయట దొరికే రకరకాల పుస్తకాలను కొనుక్కొని తెచ్చి మరి చదివి వినిపించేవారు. లైబ్రరీకి వెళ్లేవారు. కానీ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన తర్వాత వేర్పాటు కుటుంబాలు ఏర్పడ్డాయి. పిల్లలకు కథలు చెప్పే వారు కరవయ్యారు.ఇప్పుడు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయింది. పిల్లల భావి జీవితానికి ఉపయోగపడే విషయాలను చెప్పి , వారిని గొప్పగా ఎవరు తీర్చిదిద్దుతారు. మరి పిల్లల మనసుల్లో మంచి విషయాలు బలంగా నాటుకోవాలి. అంతేకాకుండా పిల్లల అంతర్గత శక్తులను బయటకు తీసి మనో వికాసాన్ని కలిగించాలంటే దానికి ఒకటే మార్గం అదే బాల సాహిత్యం .ఏ దేశంలో నైనా’’ బాల సాహిత్యం ఉన్నత ప్రమాణాలను సంతరించుకొని ఉంటుందో ఆ దేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది ‘‘.చదువు అంటే చదవడం రాయడం బట్టి పట్టి పరీక్షలు రాయడం కాదు. నైతిక విలువలతో సమాజానికి బాధ్యత కలిగిన వ్యక్తిత్వం కలవారిగా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో జీవించడం నేర్పించడం .అందుకే పాఠ్యపుస్తకాల తో పాటు బాల సాహిత్య పుస్తకాలను కూడా చదివించాలి .మంచి చెడు విచక్షణ లేకపోవడం. దుర్గుణాలకు కారణం చిన్న వయసులో బాలసాహిత్యం చదవకపోవడం, పెద్దలు చెప్పకపోవడం. అందుకే పిల్లలతో బాల సాహిత్యం చదివిస్తే వారిలో అనేక సుగుణాలను పెంపొందింప చేయవచ్చు. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చి దిద్దవచ్చు.
పసి మొగ్గల్లాంటి బాల బాలికలకు అర్థవంతమైన నీతి కథలను అందిస్తున్నారు ఆర్ సి కృష్ణస్వామి రాజుగారు. సహజసిద్ధమైన కథ వస్తువులతో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు .సమాజం పట్ల బాధ్యత కలిగిన సాహితీవేత్తగా పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు. రాజు గారి కలం నుండి జాలువారిన బాలల కోసమే రాసిన నాలుగవ బొమ్మల కథల సంపుటి ‘‘నాన్నారం కథలు’’. ఇందులో వాస్తవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు నీతి కథల ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
ఇందులో మొత్తం కథలు 30. దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. మొదటి కథ ‘‘మతి మరుపు నాన్న ‘‘చివరి కథ ‘‘బంగారు కోడి పెట్ట.’’
‘‘అక్షరాల తోవ’’. బడికి వెళ్ళే పిల్లలు చదువుకోకుండా సముద్రములో చేపలు పట్టడానికి
ప్రాముఖ్యత ఇస్తున్నారు. బడికి వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. రచయిత ఈ కథలో ‘‘ఆస్తులున్న వాడి కన్నా, అక్షరాలు నేర్చిన వాడే మిన్న’’అనే చక్కటి సందేశాన్ని అందించాడు. ‘‘పిల్లలు బడిలో , పెద్దలు పనిలో’’ ఉండాలని తెలియజెప్పారు.
మరో చక్కటి సందేశాన్ని అందించే కథ ‘‘దత్త పుత్రుడు ఎంపిక’’. మనం అనే పదం ‘‘కలుపుకుప పోయే తత్వం,’’ మీ అనే పదం ‘‘వేరు’’ అనే భావం ఉంది. అందరితో మనం కలుపుకు పోయె విధంగా ఉండాలనే విషయాన్ని ఈ కథలో తెలుసుకుంటారు.
‘‘వడగండ్లు’’ కథలో మన మంచి కోరే వారి కోపం వడగండ్లు లాంటిది. వారు కఠినంగా మాట్లాడినపుడు బాధ కలిగినా ఆ మాటల వల్ల మనకు మంచే జరుగుంది. చెడు జరుగదు అనే సందేశం అందించారు రచయిత ఆర్ సి కె రాజు గారు.
‘‘పొద్దు తిరుగుడు పువ్వు’’ కథలో మొక్కకు సంబంధించిన పిల్లలకు తెలియని సమాచారం అందించాడు.’’బంగారు కోడిపెట్ట ‘‘కథలో సమయస్ఫూర్తితో ఏ విధంగా వ్యవహరించాలో తెలిపే చక్కటి కథ .ఇలా ఆర్ .సికే రాజు రాసిన ప్రతి ఒక కథ ఆణిముత్యంగా చెప్పవచ్చు.ఇలాంటి బొమ్మలతో కూడిన కథలు వారి కలం నుండి జా లు వారాలని కోరుకుంటూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
ఇందులో మొత్తం పేజీల సంఖ్య 101. పుస్తకం ధర 140. పుస్తక ముఖ చిత్రం జంతువుల బొమ్మలతో అందంగా తీర్చి దిద్దారు.
పుస్తక ప్రతులకు:
– ఆర్ సి కృష్ణస్వామి రాజు
తిరుపతి :9393662821
– యాడవరం చంద్రకాంత్ గౌడ్
సిద్దిపేట, 9441762105





