బాలగోపాల్ మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది.
యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి
దినదిన ప్రవర్ధమానమై అనేక రంగాలకు విస్తరించి, సాధారణ మానవులకు గోచరించని అనేక కొత్త విషయాలను ఆవిష్కరించింది. ఆ రకంగా చూసినప్పుడు ఆయనది ఒక అసాధారణమైన అరుదైన వ్యక్తిత్వం. అంత అసాధారణమైన, సృజనాత్మకమైన, నిబద్దతతో కూడిన వ్యక్తిత్వం కావడం వల్లనే అది దేశవ్యాప్తంగా అనేకమందిని నేటికీ ఉత్తేజపరుస్తూ ఉన్నది. సామాజిక రాజకీయ రంగాలలోకి ఆయన ఆసక్తి విస్తరించిన తర్వాత ఆయా రంగాలలో ఆయా ఉద్యమాలతో ఆయన మమేకమైన తీరు అసాధారణమైనది. ఆనాడు తన పదునైన మేధాశక్తితో వేసిన అంచనాలన్నీ నేడు వాస్తవాలుగా తేలుతున్నాయి.ఆనాడు క్రమంగా విస్తరిస్తున్న హిందూత్వ ఫాసిస్టు భావజాలం ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరిస్తే మనం అంత తీవ్రంగా పరిగణించనే లేదు.నేడది ఒక కఠిన వాస్తవంగా మరి మన హక్కుల్ని కాలరాస్తుంటే, రాజ్యాంగ విలువలను కూలదోస్తుంటే నిశ్చేస్టులమై చూస్తూ ఉండిపోతున్నాం.
బాలగోపాల్- ప్రాసంగికత
ఆయన మరణించే నాటికి సాంఘిక మాధ్యమాల విస్తృతి పెద్దగా లేకపోవటం కారణంగా, అవి ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలవు అన్న విషయంలో బాలగోపాల్ విశ్లేషణ దురదృష్టవశాత్తు మనకు లభించడం లేదు. అటు పిమ్మట సమాజంపై సోషల్ మీడియా యొక్క ప్రభావం క్రమంగా పెరిగి, భారతదేశ రాజకీయాల్ని , ప్రజల రాజకీయ అభిప్రాయాల్ని సైతం ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగిన తరువాత సంభవించిన పరిణామాల్ని విశ్లేషణ చేయడంలో, వాటిని ముందే పసిగట్టడంలో బాలగోపాల్ విశ్లేషణ, అతని అంచనా ఎలా ఉండేది? అన్న ప్రశ్న ఈనాటికి ఆసక్తి దాయకమైనదే.2014 తరువాత భారతదేశంపై ఫాసిస్టు కొండచరియ విరిగిపడే నాటికి, రెండు మూడు సంవత్సరాల ముందు, అటు తర్వాత కూడా సోషల్ మీడియాను వాడుకొని ఉత్తర భారతదేశపు ప్రజాభిప్రాయాన్ని హిందుత్వ భావజాలానికి అనుకూలంగా మార్చటంలో సంఘ్ పరివార్ గణనీయమైన విజయం సాధించింది.
అదే విధంగా దక్షిణ భారతదేశంలో సైతం తన ఉనికిని పెంచుకోవడానికి, రాజకీయంగా కాలు మోపటానికి కర్ణాటక రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి, అది అనుసరించిన విభజన, హత్యా రాజకీయాన్ని అమలు చేసింది.మత విద్వేషం పై, మూఢ నమ్మకాలపై, మత దురభిమానంపై ఆధారపడి రాజకీయాల్ని నడిపే హిందుత్వ శక్తులకు వ్యతిరేకమైన, హేతువాద భావజాలానికి ప్రతినిధి అయిన నరేంద్ర దబోల్కర్ ను, వామపక్ష భావజాలానికి ప్రతినిధి అయిన గోవిందు పన్సారె ను, రాజ్యాంగ విలువలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన గౌరీ లంకేశ్ ను, సాంస్కృతిక, తాత్విక రంగంలో హిందుత్వ భావజాలాన్ని తన లోతైన విశ్లేషణల ద్వారా, పరిశోధనల ద్వారా దునుమాడిన ఎం ఎం కల్బుర్గిని హత్య చేసి తమ భావజాలానికి ఎదురులేకుండా చేసుకునే వ్యూహాన్ని హిందూ ఫాసిజం అమలు చేసింది.ఈ రకంగా క్రమక్రమంగా బలం పెంచుకుంటూ పోయి, మత దురభిమానాన్ని రెచ్చగొట్టి, దేశ ప్రగతికి మైనారిటీలే కారణమనే తప్పుడు సమాచారాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి తనకు గణనీయమైన ఓటు బ్యాంకును హిందుత్వ శక్తులు సృష్టించుకోగలిగాయి.
ఉత్తర భారత దేశంలో గో రక్షణ పేరుతో వందల మంది మైనారిటీలను హత్య చేసి, మత విశ్వాసాలను రాజకీ యాలతో కలగలిపి అధికారానికి సోపానంగా మార్చుకు న్నాయి హిందుత్వ శక్తులు.అపరిమిత వేగంతో అమలు చేసిన ప్రైవేటీకరణ ద్వారా గాని, అవినీతిని, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పి చేసిన నోట్ల రద్దు ద్వారా గాని సామాజిక రంగంలో ఏ రకమైన అనుకూల ఫలితాలను రాబట్టుకోలేక పోయిన హిందూత్వ శక్తులు, తరచుగా మతపరమైన అంశాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి, 2014 నుంచి ఆ విషయాల పైననే చర్చ జరిగేట్లుగా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాయి.అయోధ్య నుంచి మొదలుకుంటే జ్ఞానవాపి మసీదు వివాదం దాకా, ట్రిపుల్ తలాక్ విషయం నుంచి మొదలుకుంటే హిజాబ్ వివాదం దాకా చర్చ మొత్తం మతపరమైన విషయాల చుట్టూ తిరిగేట్లుగా ప్రతిసారి సమస్యను హిందుత్వ శక్తులే ముందరికి తీసుకురావడం, దానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ప్రతిస్పందించడమే ఈ తొమ్మిదేళ్ల కాలంలో జరుగుతూ వస్తూ ఉన్నది.
అభివృద్ధి విషయంలో గానీ, ఉపాధి కల్పన ప్రాతిపదికన గాని, ప్రజారోగ్య ప్రాతిపదికన గాని సాధించిన అభివృద్ధి ఏమిటో ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా చర్చకు రాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు.పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం గడిచిన తొమ్మిది ఏళ్లలో ఎప్పుడు ప్రధానమైన అంశంగా మారలేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.ప్రజల సామూహిక వివేచనను ఇంతగా దృష్టి మళ్లించి వారి రాజకీయ అభిప్రాయాలను ఇంతగా పక్కదారి పట్టించగలిగే పకడ్బందీ వ్యూహాన్ని సోషల్ మీడియా ద్వారా అమలు చేయగలగటం ఎట్లా సాధ్యమైంది? ఇది ఇంకెం తకాలం కొనసాగగలదు? అన్న ప్రశ్నలకు కర్ణాటకలో ఇటీ వలి ఎన్నికల ఫలితాలు ఓరకంగా సమాధానం చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ బాలగోపాల్ ఉండి ఉంటే ఆయన ఈ పరిస్థితిని ఎలా వివరించి ఉండేవారు అన్న కుతూహలం సామాజిక చైతన్యం ఉన్న ఎవరికైనా కలగక మానదు.
హిందుత్వ శక్తుల తప్పుడు ప్రచారపు బుట్టలో పడ్డ ఒక గణనీయమైన ప్రజా సమూహం యొక్క ప్రభావం భారత ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాసామాన్యంలోని ఒక భాగం వారిలో మాత్రమే ఉన్న అభిప్రాయంగా కాక ఉన్నత స్థానాల్లో ఉన్న, ప్రధాన ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటికి నేతృత్వం వహిస్తూ ఉన్న వ్యక్తుల్లోకి సైతం ఇంకిపోవటం వల్ల క్రమంగా స్వతంత్రంగా వ్యవహరించవలసిన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటి కుప్పకూలుతున్న చప్పుడు, రాజ్యాంగాన్ని ప్రేమించే రాజ్యాంగ నైతికతకు కట్టుబడే ఎవరికైనా ఆందోళన కలిగించే విషయమే.
తన రచనల్లో సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మంల గురించి లోతుగా విశ్లేషించి మనల్ని ఎంతో చైతన్యపరిచాడు బాలగోపాల్.
నిన్నటికి నిన్న ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే మొట్టమొ దటిసారి హిందుత్వ శక్తులు ప్రతిస్పందించే విధంగా చేసింది. ఇప్పటివరకు గత తొమ్మిది ఏళ్లుగా జరిగిన చర్చ లో బంతి ఎప్పుడు ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్షాల కోర్టులోనే ఉంటూ ఉండేది. ఉదయనిధి వ్యాఖ్యల ద్వారా మొదటిసారి బంతి హిందుత్వ శక్తుల కోర్టులో పడి వారు ప్రతిస్పంది ంచాల్సి వచ్చింది.గత నాలుగు నెలలుగా మత విద్వేష కీలల్లో రగిలి పోతున్న మణిపూర్ వారి కుటిల రాజకీయాలకు తాజా ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది. ఇరువురు మహిళల నగ్న ఊరేగింపు ఆనక వారిపై జరిగిన సామూహిక అత్యాచారం లేశమాత్రం మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన. మత ప్రాతిపదికన ప్రజల్ని విభజించి ఒకరిపై ఒకరిని ఎగదోసి ఆ మంటల్లో వందలాదిమందిని హత్య చేయగలిగే విద్వేషాగ్నులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ ఉన్న హిందుత్వ శక్తులకు మణిపూర్ తాజా ప్రయోగశాలుగా మారింది. మానవత్వాన్ని బలిపెట్టి అధికారాన్ని నిలబెట్టుకునే ఈ వికృత క్రీడకు హిందూత్వ శక్తులు తెగబడటం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నదానికి ఒక సూచిక.
అయితేప్రజా చైతన్యం జాగృతమై, ఆవశ్యక సమస్యల పైన ప్రశ్నించడం మొదలు పెడితే, ఇన్నాళ్లు చర్చను పక్కదారి పట్టించి, దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడు తున్న మతతత్వ శక్తుల ఆటలు సాగవని మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు మతతత్వ శక్తులు కొనసాగించిన విభజన రాజకీయాలతో, పరిపాలన విధానంతో విసిగిపోయిన ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు తమ వంతు బాధ్యతను, సామాజిక మార్పుకు తాము నిర్వహించవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తే జరిగేది ఏమిటో మనకు ఎన్నికల ఫలితాలు సూచించాయి. అయితే ప్రమాదం ఇంతటితో ముగిసిపోలేదు. ఎందుకంటే మతతత్వ శక్తులు గత పదిహేనేళ్లుగా కొనసాగిస్తున్న విద్వేష ప్రచారానికి బలి అయిపోయి, మత దురభిమానాన్ని, పరమత విద్వేషాన్ని వంట పట్టించుకున్న వ్యక్తులు అకస్మాత్తుగా ఎన్నికల ఫలితాలు తారుమారు కాగానే అదృశ్యమై పోరు, అలాగే వారికి ఉన్న విద్వేష మత రాజకీయ అభిప్రాయాలు మారిపోవు. ఇప్పటికీ వారు ఉత్తర భారత దేశంలో పని చేసినట్టుగానే కర్ణాటకలోనూ పని చేస్తున్నారు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తూనే ఉన్నారు.
వారు ప్రవహింపజేస్తున్న తప్పుడు సమాచారపు ఊబిలో పీకల్లోతు మునిగిపోయి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన సమూహం ఇంకా ఈ దేశంలో అలాగే ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ దేశపు ప్రజాస్వామిక వాదులు చేయవలసిన కృషిని మనకు విశ్లేషణాపూర్వకంగా ఎవరైనా చెప్పగలిగితే బాగుండునని అనిపించని వారు ఉండరు. ఈ ఊహ కలిగిన మరుక్షణం మనకు గుర్తుకొచ్చే అతి కొద్ది మంది ప్రగతి శీల మేధావుల్లో బాలగోపాల్ ముందు వరుసలో ఉంటాడు.వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనం రాజకీయంగా హిందుత్వ శక్తులను అధికారం నుంచి తొలగించటం సాధ్యమైతే కావచ్చు. కానీ అది గణనీయమైన ప్రజా సమూహపు ఆలోచనలలో కలిగించిన సాంస్కృతిక వైకల్యాన్ని తొలగించాలంటే, ప్రగతిశీల వాదులకు బహుశా రెండు మూడు దశాబ్దాలు అయిన పట్టవచ్చు.
అయితే ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించాలో తన రచనల్లో సవివరంగా పొందుపరిచారు. ఆయన రచనల ఆయన ఆలోచనల వెలుతురులో మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య లను విశ్లేషించుకొని కొత్త వ్యూహాన్ని రూపొందించుకొని భవిష్యత్ తరాలకు ఒక ప్రజాస్వా మ్యయుతమైన నూతనమైన భారతాన్ని సృష్టించటం ద్వారా ఆయన లేని లోటును మనం భర్తీ చేసుకోవచ్చు.
రాష్ట్ర కార్యదర్శి
మానవ హక్కుల వేదిక,తెలంగాణ
9494037288





