బహుజన తల్లీ… లచ్చవ్వ

లచ్చవ్వా…
తోలిసూరు బిడ్డగా నువు పుడితే
లచ్చిందేవి ఇంట్లకొత్తందని
మీ అయ్య ప్రేమతోని పెట్టుకున్నడటనే లచ్చావ్వా అనీ
ముడుసు ముదురని కాళ్లతోని
మొగోళ్ళకైనా మొసవర్రని మోటగొట్టి
మంచెనెక్కి పెరడి కావలుండేడిదని నువు జెపుతుంటే
మాదిగిండ్ల కాపు గాసే బాల ఎల్లవ్వ తీరు కనపడ్డవే అవ్వా
పాల పండ్లైన ఊడకముందే..
పసుపు తాడు మెడల పడితే
రెక్కలిరిగిన పచ్చివోలే శిన్నబోయి
రెక్కలు ముక్కలు జేసుకుని ఇంటిని, ఇంటిల్లిపాదిని
సచ్చేదాకా సదిరిచ్చుకొచ్చినవే లచ్చవ్వా…
అవ్వా…
బుక్కెడు బుక్కెడు బువ్వకోసం
నువుపడ్డ శెరలన్నింటిని వరుసగా శెపుతుంటే
శెరువు మీన ఆగకుండా తడలు తడలుగా వచ్చే
అలల తీరుగా ఉంటయే
కట్టాన్ని తలసిన ప్రతిసారీ నీ కళ్ళు
అలుగులు బడ్డ శెరువులైతాయే…
అయ్య సచ్చినంక కూలిపోయేటి ఇంటికి
నిట్టాడై ఇల్లు నిలబెట్టినవే నువ్వు
తల్లి కోడోలే మమ్ముల సాది
నాలిగిత్తులు మా నెత్తినేసి
మా బతుకు గూట్లే ఎలుగులు నింపిన దీపంతవే నువ్వు
లచ్చవ్వా….
నీ కోడలు నీల్లోసుకున్నపుడు
పలారాలు పెట్టడానికి పైసలు లేవని నేను తండ్లాడుతుంటే
బిడ్డా… పలారాలూ పెట్టకుంటే….
పోరగల్లు ఏమైనా వంకరటింకర పుడుతరారా?
అని నువు అడిగినపుడు
తెలిసి తెలియక అమాయకంగా అడుగుతున్నవో ..లేక
నా అమాయకత్వాన్ని ప్రశ్నించినవో
నేటికీ ప్రశ్నగానే ఉన్నదే నాకు
మాకొక్కపూట గొడ్డుకూర పెట్టడానికి
పత్తిమిల్లుల నీ నెత్తురెంత ఖర్సుపెట్టినవో
మమ్ములింత సదివియ్యడానికి
ఈ దేశం నీ నెత్తురెంత తాగిందో తలుసుకున్నపుడల్ల
కండ్లపొంటి నీళ్ళ బదులు నెత్తురొలుకుతదే లచ్చవ్వా..
అవ్వా… నీ కట్టాన్ని తలుసుకున్న ప్రతిసారీ
నున్నగున్న పెయి బట్ట బొంతపురుగై కుడుతదే
ఒళ్ళలువక కూసున్న ఎత్తుమెత్త కుర్శి
పట్నం తుమ్మ ముల్లోలే కుచ్చుకుంటదే
లచ్చవ్వా… నువు ఒక లచ్చవ్వవు కాదే…
ఈ దేశంలో బిడ్డల బతుకుల మైల పోగొట్టడానికి
సబ్బు బిళ్ళ్లోలే తనువులు కరిగిచ్చుకున్న
కోటొక్క తల్లుల రూపువే నువ్వు…
లచ్చవ్వా… నువ్వు
బహుజన గుడిసె నిట్టాడవు
బహుజన గూట్లే ఏలుగులు పంచే దిగుట్లే దీపాంతవు
బహుజన రాజ్యపు పోరుజేసే
పిల్లల ఆకలిదీర్చే ఉట్టిమీద సద్దికూడువు.
లచ్చవ్వా….
నువ్వు బహుజన తల్లివే…
కోటొక్క బాధలున్నా…
కడదాకా కొట్లాడే బలమిచ్చే తల్లివే….
నువ్వు బహుజన తల్లివే…

– దిలీప్‌.‌వి, జిల్లా కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా
మానవ హక్కుల వేదిక, 8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *