హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : మన ఓటును మనువాద దోపిడీ కులాల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి బానిసలుగా ఉండాలా లేదా అనే విషయం తేల్చికొనే సమయం ఆసన్న మైనదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నిమ్న జాతుల పౌర సమాజానికి పిలుపునిచ్చారు. మనకు ఓటు హక్కు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు సాధన కోసం పనిచేస్తున్న బహుజనుల పార్టీలకు ఓటు వేసి పొలిటికల్ పవర్ సాధించి పాలకులుగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం హిమాయత్‌నగర్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓటు చైతన్య కార్యక్రమాన్ని కృష్ణ స్వరూప్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెజార్టీ దళిత బహుజన పౌర సమాజానికి ఓటు వద్దని 1932 లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ నాటి గాంధీ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ అంబేద్కర్ ను, బ్రిటిష్ వారిని అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ మనువాదుల రాజకీయ సామాజిక దోపిడీ వారసులు కాంగ్రెస్, బీజేపీ బిఆర్ఎస్ వంటి పార్టీలు కోట్ల రూపాయలతో ఆ ఓటును కొనుకుంటున్నారని విమర్శలు చేశారు. తెలంగాణలోని ఎన్నికలను ఖరీదయన కార్పొరేట్ వ్యాపారంగా ఈ దొంగల పార్టీలు మార్చివేసి పవిత్రమైన ప్రజా ఎన్నికలను కలుషితం చేసారని ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఎన్నికల ప్రజాస్వామిక పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థను ఈ మాఫియా ప్రజా ద్రోహుల పార్టీలు ఖునీ చేస్తున్నారని విమర్శించారు. ఓటును సక్రమంగా వినియోగించుకొని సమతా రాజ్యం నిర్మాణానికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డా. విఎల్.రాజు, డిబిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాసు, ఒడిస్సా రాష్ట్ర కన్వీనర్ ఆదిత్య చిన్నన్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు
మద్దెల ప్రవీణ్ కుమార్, పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎండి.హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.





